- తలమానికంగా తెలంగాణ తల్లి మండపం
- జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకకు సిద్ధం
సారథి న్యూస్, నర్సాపూర్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ప్రతీకగా హత్నూర మండలం కాసాల-దౌల్తాబాద్ శివారులోని చౌరస్తాలో తెలంగాణ తల్లి మండపాన్ని ఏర్పాటుచేశారు. టీఆర్ఎస్ అనుబంధ, దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దేవులపల్లి గ్రామానికి చెందిన పొట్టి జనార్దన్ రెడ్డి ఈ మందిరం నిర్మాణానికి విశేషంగా కృషిచేశారు. 2010 సెప్టెంబర్ 13న అప్పటి ఉద్యమ రథసారథి, నేటి సీఎం కె.చంద్రశేఖర్ రావు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర సాధనలో భాగంగా రాస్తారోకోలు, ర్యాలీలు ఇక్కడే కొనసాగేవి. ఐదుగురు యువకులు డబ్బు గోపాల్, చిన్న నర్సింలు, ఇంద్రశేఖర్ రెడ్డి, మారుతి రాజ్, సలీమ్ నాలుగు రోజుల పాటు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను స్వయంగా కేసీఆర్ వచ్చి విరమింపజేశారు. ‘సచ్చి సాధించడం కాదు.. బతికుండి పోరాడాలని’ వారికి హితబోధ చేశారు. నర్సాపూర్ –సంగారెడ్డి మెయిన్ రోడ్డుపై ఉండడంతో ఇక్కడి నుంచి వెళ్లే వారంతా ఈ విగ్రహ మండపాన్ని చూడకుండా వెళ్లలేరు. జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ముస్తాబవుతోంది.