సారథి న్యూస్, నాగర్ కర్నూల్: శనివారం నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుండడంతో ముస్లిలంతా ప్రార్థనలను, మతపరమైన ఆచారాలను ఇళ్లలోనే ఉండి జరుపుకోవాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ ఈ.శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. కరోనా నేపథ్యంలో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానుండడంతో లాక్‌డౌన్ నిబంధనలు, సామాజికదూరం పాటించేలా చూడాలని జిల్లా ముస్లిం మతపెద్దలకు ఆయన కోరారు. శనివారం తెల్లవారుజాము నుంచి తొలి ఉపవాసదీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముస్లిం సోదరులు ఇళ్లలోనే ఉండి రంజాన్ వేడుకలను, ఇఫ్తార్ జరుపుకునేలా చూడాలని జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల ముస్లిం మత పెద్దలకు కలెక్టర్ శ్రీధర్ సూచించారు. సౌదీ అరేబియా వంటి ఇస్లామిక్ దేశాలతో సహా ప్రపంచంలోని చాలా దేశాలు కూడా మసీదులు మరియు మతానికి సంబంధించిన ప్రదేశాలలో జరిగే కార్యక్రమాలను కూడా నిషేధించారని గుర్తుచేశారు.
ముస్లింలు వజూ చేసే సందర్భాల్లో లిక్విడ్ సోప్ లను వినియోగించాలని, ఉపవాస దీక్షలు చేపట్టే వారు తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రత జాగ్రత్తలు పాటించాలి అన్నారు. ఎవరు కూడా ఉపవాస దీక్షలు కొనసాగిస్తూ బయటకు రావద్దని, ఇంట్లోనే ఖురాన్ చదువుతూ పిల్లలతో చదివిస్తూ ఉండాలని, కరోనా మహమ్మారిని జిల్లా నుంచి తరిమి వేసేందుకు, సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఇంట్లోనూ భౌతికదూరం పాటిస్తూ ప్రార్థనలు నిర్వహించాలన్నారు.
నేటినుంచి ప్రారంభం కానున్న ఉపవాస దీక్షలు తమతమ కుటుంబసభ్యులతో గడుపుతూ సుఖసంతోషాలతో ఈ మాసం అంతా కొనసాగించాలని సూచించారు.