న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు విధించిన లాక్ డౌన్ వలస కూలీల పొట్టకొడుతోంది. తినేందుకు తిండి లేక, పనులు లేక డబ్బుల్లేక వాళ్లంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ కోసం ప్రభుత్వం శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేసినా.. అవి సమయానికి రావడంలేదని, ఆకలికి తట్టుకోలేక ఎండకు తట్టుకోలేక ఇక్కడే చచ్చిపోతామేమో అని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లలో సీటు ఎప్పుడు దొరుకుతుందా.. ? ఇంటికి ఎప్పుడు పోతామా అని రైల్వే స్టేషన్ల దగ్గర, కరోనా స్క్రీనింగ్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇంటికి వెళ్లేకంటే ముందే ఆకలితో.. ఎండ దెబ్బకు చచ్చిపోతామేమో అని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, గర్భిణులు కూడా గంటల పాటు స్క్రీనింగ్ కోసం లైన్‌లో నిలబడుతున్నారని అన్నారు.
‘ఆకలితో ఇక్కడ ఇలాగే చచ్చిపోతామేమో. నిన్న ఉదయం 11 గంటల నుంచి ఇక్కడే వేచి ఉన్నాను. కనీసం తినేందుకు తిండి కూడా ఇవ్వలేదు. పైగా పోలీసులు తిడుతున్నారు’ అని బీహార్ ట్రైన్ కోసం వచ్చిన కరీష్మా దేవి అనే గర్భిణి ఆవేదన వ్యక్తంచేసింది. ‘నిన్న పొద్దంతా ఇక్కడే ఉన్నాను. ట్రైన్ లేదు. మీం వెళ్లాల్సిన రైలు పొద్దునే బయలుదేరుతుంది’ అని అర్ధరాత్రి దాటాక మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూసుకుని వచ్చే సరికి రైలు వెళ్లిపోయింది. కనీసం తినేందుకు తిండి లేదు. డబ్బుల్లేవ్ ఆకలితో, ఎండలో చచ్చిపోయేలా ఉన్నాం” అని బీహార్‌కు చెందిన అశోక్ కన్నీరు పెట్టుకున్నాడు. ప్రోటోకాల్ ప్రకారం శ్రామిక్ రైలులో వెళ్లేందుకు రిజిస్టర్ చేసుకున్న వారికి ఒక రోజు ముందు మెసేజ్ ఇవ్వాలి. వాళ్లంతా స్క్రీనింగ్ సెంటర్లకు వచ్చి పరీక్షలు చేయించుకున్న తర్వాత రైళ్లలోకి అనుమతిస్తారు. అయితే తమకు మెసేజ్‌లు రావడం లేదని, ఎప్పుడో అర్ధరాత్రి నిద్రపోతున్నప్పుడు మెసేజ్‌లు వస్తున్నాయని, దాని వల్ల టైమింగ్స్ తెలుసుకోలేగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.