Breaking News

ఆసీస్​లో ఈసారి కష్టమే

న్యూఢిల్లీ: గతంతో పోలిస్తే.. ఈసారి ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన చాలా కఠినంగా సాగుతుందని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. స్మిత్‌, వార్నర్‌ రాకతో కంగారుల బలం చాలా పెరిగిందన్నాడు. దీనిని ఎదుర్కొవాలంటే కోహ్లీసేన సర్వశక్తులు ఒడ్డాల్సిందేనన్నాడు. అయితే గతంతో పోలిస్తే టీమిండియా బౌలింగ్‌ మెరుగు కావడం సానుకూలాంశమని చెప్పాడు. ‘బాల్ ట్యాంపరింగ్ తర్వాత స్మిత్, వార్నర్ ఫామ్ పెరిగింది. ఈ ఇద్దరినీ ఆపాలంటే భారత బౌలర్లు కొత్త వ్యూహాలను అమలు చేయాలి. దీనికితోడు గత సిరీస్​కు ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ భావిస్తోంది. కాబట్టి ఇరుజట్ల మధ్య హోరాహోరీ తప్పదు. ఈ ఏడాదికే పెద్ద సిరీస్​గా మిగిలిపోతుందనే అంచనాలు ఉన్నాయి.

స్మిత్, వార్నర్ లేకపోవడంతో గత సిరీస్​లో ఆసీస్ బ్యాటింగ్ సమస్యలు ఎదుర్కొంది. వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో బౌలర్లకు పట్టుబిగించే సమయం ఇవ్వలేకపోయారు. ఈసారి మాత్రం బ్యాట్స్​మెన్, బౌలర్లు సమతూకంతో ఉన్నారు. ఇప్పుడు మనకున్న మరో బలం మన బౌలింగ్. గతంలోకంటే ప్రమాదకరంగా ఉండటం కలిసొచ్చే అంశం’ అని ద్రవిడ్ విశ్లేషించాడు. 2018–19 ఆసీస్‌ వేదికగా జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను విరాట్‌సేన 2–1తో సొంతం చేసుకుంది. దీంతో 71 ఏళ్ల తర్వాత ఆసీస్‌ గడ్డపై తొలిసారి టెస్ట్‌సిరీస్‌ గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది.