సారథి న్యూస్, నల్లగొండ: నల్లగొండలో మహిళకు పాజిటివ్ నిర్ధారణ సూర్యాపేట లింక్‌తో వచ్చినట్లు భావిస్తున్న అధికారులు నల్లగొండ జిల్లాలో కరోనా వైరస్‌ను కట్టడి చేశామన్న ఆనందంలో అధికార యంత్రాంగం ఉంది. ఇక కొత్త కేసులు లేవని సంతోషపడ్డారు. 12 రోజులపాటు 300 పైచిలుకు అనుమానితుల శాంపిల్స్ పరీక్షలకు పంపారు. అందరికీ నెగిటివ్ వచ్చింది. ఇప్పటికే నమోదైన 12 కేసుల్లో ఆరుగురు గాంధీ ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి కూడా వచ్చారు. ఇక ఉన్నవి ఆరు కేసులు మాత్రమే అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. అది కూడా సూర్యాపేట లింక్‌తోనే కావడం గమనార్హం.
కుడకుడలో దావత్‌కు వెళ్లొచ్చిన జంట
నల్లగొండ పట్టణంలోని మాన్యంచెల్కకు చెందిన భార్యాభర్తలు సూర్యాపేట జిల్లాకేంద్రం సమీపంలోని కుడకుడలో జరిగిన ఫంక‌్షన్‌కు వెళ్లొచ్చారు. వారిలో భార్య కొద్దిరోజులుగా దగ్గుతో బాధపడుతుండగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యాధికారులకు అనుమానం వచ్చి శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపించగా కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఇన్నిరోజులు ప్రశాంతంగా ఉన్న అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. ఆమె భర్తతోపాటు పిల్లలను ఐసోలేషన్‌కు తరలించారు. ఆమె నివాసప్రాంతాన్ని పోలీసులు దిగ్బంధించారు. మాన్యంచెల్క ప్రాంతాన్ని అంతా హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి
కరోనా పాజిటివ్ వచ్చిన మహిళ భర్త ప్రభుత్వ ఉద్యోగిగా తెలుస్తోంది. అయితే ఇతనికి ప్రస్తుతం పాజిటివ్ నిర్ధారణ కాలేదు. ఇతని నమూనాలను పంపారు. వీరు గత నెల కుడకుడలో జరిగిన ఫంక‌్షన్‌కు వెళ్లొచ్చారు. లాక్ డౌన్ కంటే రెండు రోజుల ముందుగా ఈ ఫంక‌్షన్ జరిగింది. అయితే ఆ తర్వాత అతను విధులకు హాజరయ్యాడా.. లేదా.. ఒకవేళ హాజరైతే ఎవరినైనా కాంటాక్ట్ అయ్యాడా అన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు.
సూర్యాపేటలో హైఅలర్ట్
సూర్యాపేట పట్టణంలో హై అలర్ట్ నెలకొంది. కొద్దిరోజుల వ్యవధిలోని జిల్లాలో 54కేసులు నమోదవడం.. అందులో సూర్యాపేట పట్టణంలోని మార్కెట్ బజార్‌లోని వ్యాపారులకు ఎక్కువగా పాజిటివ్ రావడంతో అంతా అప్రమత్తమయ్యారు. ఇక్కడ శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపారు. అయితే ఇందులో ఎన్ని పాజిటివ్ కేసులు వస్తాయోనన్న ఆందోళన నెలకొంది. పట్టణాన్ని మొత్తం దిగ్బంధం చేసి అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.