న్యూఢిల్లీ: ఆడపిల్లలకు ఆస్తిలో వాటా కల్పించడం, హక్కుదారుగా గుర్తించడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు దాఖలైన పిటీషన్లపై విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వినిపించింది. తండ్రి జీవించి ఉన్నా.. లేకపోయినా ఆడపిల్లలకు మాత్రంలో ఆస్తిలో సమానహక్కు ఉంటుందని తేల్చిచెప్పింది. కుమారులతో సమానంగా కుమార్తెలకు ఆస్తిలో వాటా ఉంటుందని, దానిపై హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.
చట్టం ఏం చెబుతోంది
హిందూ వారసత్వ చట్టం-1956లో సవరణలు చేశారు. సవరణలతో కూడిన చట్టాన్ని 2005 సెప్టెంబర్ 9న పార్లమెంట్ ఆమోదించింది. తండ్రి సంపాదించిన ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కు ఉంటుందని ఇందులో పొందుపరిచారు. దీనికి సంబంధించిన పిటీషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తాజాగా తన తీర్పును వెలువడించింది. 1956 నాటి హిందూ వారసత్వ చట్టంలో సవరణలు చేపట్టే నాటికి కుటుంబంలో ఆడపిల్ల పుట్టినా, పుట్టకపోయినా.. ఈ సవరణ వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీనికి ఎలాంటి కొలమానం లేదని స్పష్టం చేసింది.
చట్టం సమానంగా..
ఆ కుటుంబంలో కుమార్తె ఉంటే ఈ సవరణ వర్తిస్తుందని, ఆస్తిలో సమాన హక్కు లభిస్తుందని పేర్కొంది. దీనిపై దాఖలైన పిటీషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఎంఆర్ షా సభ్యులుగా ఉన్నారు. విచారణ సందర్భంగా అరుణ్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబంలో కుమారుడికి సమానంగా కుమార్తెలకు ఆస్తిలో సమానహక్కును కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కూతురు ప్రేమను పంచుతోంది
కూతురు జీవితాంతం తండ్రిని ప్రేమిస్తూనే ఉంటుందని వ్యాఖ్యానించారు. తండ్రి జీవించి ఉన్నా, లేకపోయినా కూతురు మాత్రం తన జీవితాంతం పుట్టింటితో అనుబంధాన్ని కొనసాగిస్తుందని, ప్రేమాభిమానాలను పంచుతుందన్నారు. ఇలాంటి పిటీషన్‌పై 2016లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం వ్యక్తమైన సందేహాలను సుప్రీంకోర్టు తెరదించినట్టయింది. 2016లో ప్రకాశ్ వర్సెస్ ఫులావతి, 2018లో సుమన్ సుర్‌పుర్ వర్సెస్ అమర్ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో గందరగోళం నెలకొందని, దీనిపై వివరణ కోరుతూ దాఖలైన పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది.
తుది తీర్పుతో తెర
ప్రకాశ్ వర్సెస్ ఫులావతి కేసులో బాధితురాలి తండ్రి 1999 డిసెంబర్ 11న మరణించారు. ఆస్తిలో ఆడపిల్లకు సమాన హక్కును 2005 సెప్టెంబర్ 9న సవరణలు చేశారు. సవరణ చేసిన తేదీని ప్రాతిపదికగా తీసుకుంటే..ప్రకాశ్ వర్సెస్ ఫులావతి కేసులో బాధితురాలికి ఆస్తిలో సమాన హక్కు దక్కదనేది దాని సారంశం. దీనిపై భిన్న వాదనలను సుప్రీంకోర్టు తెర దించింది. ఇంట్లో ఆడపిల్ల ఉంటే చాలు.. ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని తాజాగా స్పష్టం చేసింది. తుదితీర్పును వెల్లడించింది.
- August 12, 2020
- Archive
- జాతీయం
- PROPERTY RIGHTS
- SUPREMECOURT
- WOMEN LAWS
- ఆస్తిహక్కు
- సుప్రీంకోర్టు
- హిందూ వారసత్వ చట్టం
- Comments Off on ఆడపిల్లలకూ ఆస్తిలో సమానహక్కు