సారథి న్యూస్, అలంపూర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దూప దీప నైవేద్య పథకం కింద పనిచేసే అర్చక స్వాములు అంతా ఐకమత్యానికి మారుపేరుగా నిలవాలని అర్చక సంఘం ఉపాధ్యక్షుడు, అర్చక సంఘం జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు తిరునగరి నరేంద్రాచార్యులు అన్నారు. సోమవారం అలంపూర్చౌరస్తాలోని మార్కెట్ యార్డులో సంఘం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా దేవాదాయశాఖ డీడీఎన్ఎస్త్రీమెన్కమిటీ బాధ్యుడు దిండిగల్ఆనంద్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేంద్రాచార్యులు మాట్లాడుతూ.. జిల్లాలోని పలు ఆలయాల అర్చకులు వారి ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పథకం కింద పనిచేసే అర్చకుల వేతనాలు సగం కమిటీకి ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. మరికొన్ని చోట్ల పథకం కింద అన్నదమ్ముల మధ్య నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చారు.
ఇనాందారుల భూసమస్యలను చర్చించారు. అందరి సమస్యగా భావించి ఆ ప్రాంతానికి వెళ్లి పరిష్కరించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆనంద్ శర్మ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఆరవ విడత కింద ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హరితహారంలో అర్చకులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామపెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుని ఆలయాల వద్ద హరితహారం మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఖాళీపోస్టులను భర్తీచేసేందుకు దేవాదాయశాఖ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆనంద్శర్మను సన్మానించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అడవి స్వామి, రవి, కృష్ణయ్య, శివకుమార్ పాల్గొన్నారు.