న్యూఢిల్లీ: పేపర్ బాయ్ నుంచి ఫ్యూన్ వరకు.. పోస్ట్‌మెన్ నుంచి పాల వ్యాపారి వరకు.. స్టూడెంట్ నుంచి టీచర్ దాకా.. తలపండిన లీడర్ల నుంచి కేడర్ సైకిల్ యాత్రల దాకా.. పల్లె నుంచి పట్నం దాకా భారతీయుల జీవనంతో విడదీయరాని అనుబంధం కలిగిన అట్లాస్ సైకిల్ ఇక నుంచి కనిపించకుండాపోనుంది. ప్రతి భారతీయుడిని తమ తమ గమ్యస్థానాలకు చేర్చిన ఈ మధ్యతరగతి జీవనరథం చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ నోబెల్ మ్యూజియం గోడలపై కూడా మెరిసిన సైకిల్ ఇప్పుడు బొమ్మగానే మిగిలిపోనుంది. అట్లాస్ సైకిల్ చిట్టచివరి తయారీ యూనిట్ కూడా నిలిపివేసినట్లు తయారీ సంస్థ ప్రకటించింది. ఏడు దశాబ్దాల క్రితం న్యూఢిల్లీకి 40 కి.మీ. దూరంలోని హర్యానాలోని సోనాపాట్‌లో భారత్ ట్రస్ట్ సంస్థ వారు అట్లాస్ సైకిల్ తయారీని ప్రారంభించారు. సాహిబాబాద్‌లోని తన చివరి కర్మాగారాన్ని జూన్ 3 న మూసివేసినట్లు సంస్థ ప్రకటించింది. ‘మా రోజువారీ కార్యకలాపాలకు నిధులు సేకరించడంలో మాకు ఇబ్బందిగా ఉంది. మేము ముడి పదార్థాలను కూడా కొనలేకపోతున్నాం. ప్రస్తుత సంక్షోభంలో నిర్వహణ కర్మాగారాన్ని నడిపించే స్థితిలో లేము’ అని కంపెనీ ప్రకటించింది.
ప్రస్థానం ఇలా మొదలై..
అట్లాస్ సంస్థను 1951లో జానకి దాస్ కపూర్ ప్రారంభించారు. టిన్ షెడ్ నుంచి ప్రారంభించిన ఈ కర్మాగారాన్ని కేవలం 12 నెలల్లో 25ఎకరాల ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌గా మార్చారు. మొదటి ఏడాదిలో సంస్థ 12వేల సైకిళ్లను విక్రయించింది. 1952లో వేలాది సైకిళ్లను విదేశాలకు ఎగుమతి చేసింది. 1978 ఆసియా క్రీడల్లో సంస్థ భారతదేశపు మొదటి రేసింగ్ సైకిల్‌ను రిలీజ్చేసింది. 1982 లో ఢిల్లీ ఆసియా క్రీడలకు సైకిల్ రేసులో అధికారిక సరఫరాదారుగా అట్లాస్ నిలిచింది. ఎందరో రాజకీయ దిగ్గజాలు తమ యాత్రల కోసం ఈ సైకిళ్లనే వాడేవారని చెబుతుంటారు.
కష్టాలు ఇలా..
ఉరుకులు పరుగుల జీవనం.. హైటెల్ ప్రపంచంలో సైకిల్ వాడకం తగ్గిపోవడంతో 2004 నుంచి సంస్థకు కష్టాలు మొదలయ్యాయి. సంస్థ అట్లాస్ సైకిళ్ల అమ్మకాలను పెంచడానికి బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్లుగా చేసింది. ఒలింపిక్ బంగారు పతక విజేత అభినవ్ బింద్రా కూడా బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. మార్కెట్ లో డిమాండ్ తగ్గడంతో సంస్థ 2014 లో మధ్యప్రదేశ్ లోని మలన్పూర్ లోని తన కర్మాగారాన్ని మూసివేసింది. దీని తర్వాత, సోనాపట్ యూనిట్‌ను కూడా 2018 లో మూసివేయాల్సి వచ్చింది. ‘లాక్ డౌన్ తర్వాత మొదటిసారిగా జూన్ 1, 2 తేదీల్లో మేము సంతోషంగా ఫ్యాక్టరీకి వచ్చాం. గేటు వరకు చేరుకోగానే సెక్యురిటీ గార్డులు మమ్మల్ని లోపలికి అనుమతించలేదు’ అని ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ తెలిపారు. అయితే ప్లాంట్‌ను తాత్కాలికంగానే మూసివేశామని సంస్థ సీఈవో ఎన్‌పీ సింగ్ రాణా పీటీఐకి తెలిపారు.
- June 6, 2020
- Top News
- జాతీయం
- ATLAS CYCLE
- HARYANA
- అట్లాస్ సైకిల్
- భారత్ ట్రస్ట్
- Comments Off on అట్లాస్ సైకిల్ కథ.. మూత