Breaking News

బోయిన్​పల్లి కిడ్నాప్‌ కేసులో భూమా అఖిలప్రియ అరెస్ట్​

బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో భూమా అఖిలప్రియ అరెస్ట్​

సారథి న్యూస్, హైదరాబాద్‌: బోయిన్​పల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్​చేశారు. ఏ2 నిందితురాలిగా చేర్చారు. కేసు వివరాలను హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ విలేకరులకు వెల్లడించారు. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌కు ప్రమేయం ఉన్నట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. కిడ్నాప్‌ కేసులో ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ2గా అఖిలప్రియ, ఏ3గా భార్గవ్‌రామ్‌ ఉన్నారని తెలిపారు. ఉదయం 11 గంటలకు భూమా అఖిలప్రియను అరెస్టు చేసి, వైద్యపరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. హఫీజ్‌పేట్‌లో ఉన్న భూమికి సంబంధించి ఏడాది నుంచి వివాదం నడుస్తున్నట్లు తేలిందన్నారు. కిడ్నాప్‌ ఘటనలో ఇతరుల ప్రమేయం కూడా ఉన్నట్లు తేలిందని, మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. ఏపీ పోలీసుల సాయంతో మిగతా నిందితులను కూడా అరెస్టు చేస్తామన్నారు. కిడ్నాప్‌ కేసును మూడు గంటల్లోనే ఛేదించినట్లు సీపీ పేర్కొన్నారు.
ఏం జరిగిందంటే..
మంగళవారం రాత్రి మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు ఆయన సోదరులు సునీల్‌రావు, నవీన్‌ రావు కిడ్నాప్‌నకు గురయ్యారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. కిడ్నాపర్లు ఈ ముగ్గురినీ నార్సింగి వద్ద వదిలిపెట్టి పరారయ్యారు. అఖిలప్రియ సోదరుడు జగత్​విఖ్యాత్‌రెడ్డి ఫాంహౌస్‌ కాపలాదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, అఖిలప్రియ భర్త భార్గవరామ్‌, ఆయన సోదరుడు చంద్రహాస్‌, మిగతావారు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్‌

ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు జడ్జి ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. రాత్రి కావటంతో అఖిలప్రియను బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం ఉదయం చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. ఇది ఇలాఉండగా అఖిలప్రియ తరఫు న్యాయవాదులు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అఖిలప్రియకు ఆరోగ్యం సరిగా లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు కోర్టు రేపటికి వాయిదా వేసింది.