Breaking News

కివీస్ కరోనా కట్టడి అద్భుతం

‘కివీస్ కరోనా’ కట్టడి అద్భుతం

యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి అనేక దేశాలను గడగడలాడిస్తూ ప్రపంచ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా నివారణకు అనేక దేశాల శాస్త్రవేత్తలు వారి శక్తివంచనలేకుండా ఎక్కువకాలం ప్రయోగశాలల్లోనే గడుపుతూ వాక్సిన్ కనుక్కోవడానికి శ్రమిస్తున్నారు. ఈ భయానక మహమ్మారి అనూహ్యంగా విజృంభిస్తుండడంతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడానికి సంకోచిస్తూ, తప్పక బయటకు రావాల్సిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్రజలపై ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని కరోనా ప్రతాపం చాలా దేశాలపై ఇంకా తగ్గకపోగా, ప్రభావం మరింత ఎక్కువైందని చెప్పొచ్చు. కానీ ప్రపంచ జనాభాలో 0.05% (2020 మార్చి వరకు 5 మిల్లియన్ల) జనాభా కలిగి ఉండి, అత్యధిక జనాభా గల దేశాల్లో 126వ స్థానాన్ని ఆక్రమిస్తున్న ‘కివీస్’గా పేరొందిన న్యూజిలాండ్.. మే 22 నుంచి ఇప్పటివరకూ జీరో యాక్టివ్ కేసులు ఉన్న ఏకైక దేశంగా నిలిచి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. తద్వారా కరోనా నివారణలో పరోక్షంగా ప్రపంచ దేశాలకు ఒక సవాల్​ విసిరింది కివీస్. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఫలితంగా అటు ప్రజలు, ఇటు ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండాపోతోంది. కరోనా వల్ల కలిగే దుష్ఫలితాలను పూర్తిగా తెలిసినా కూడా దాని వ్యాప్తిని నివారించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయి. ఈ అంశంలో మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ, తమ ఖజానాకు లాక్ డౌన్ వల్ల ఎక్కడ గండి పడుతుందేమోననే భయంతో క్రమంగా ఒక్కో రంగానికి తమ వ్యాపారాలను కొనసాగించడానికి అనుమతులివ్వడం ద్వారా కరోనా వ్యాప్తికి ఆయా ప్రభుత్వాలే పరోక్షంగా కారణమయ్యాయి.

ఓ వైపు అమెరికా, బ్రెజిల్ దేశాల తర్వాత మూడవ స్థానంలో ఉన్న భారతదేశంలో కరోనా యాక్టివ్ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ కరోనా వ్యాప్తి అధికంగా ఉంచి అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఈ క్రమంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పాలకులు.. వైరస్ వ్యాప్తికి కారణమయ్యే అనేక వ్యాపారాలను కొనసాగించుకోవడానికి అనుమతించాయి. ఇందులో భాగంగా ఒక అడుగు ముందుకేసి షాపింగ్ మాల్స్, ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, లిక్కర్ షాపులకు అనుమతులివ్వడంతో నిన్న మొన్నటి వరకూ కొంత ఫర్వాలేదనిపించిన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వ్యాప్తి అధికమైంది. దీంతో తెలుగు ప్రజలంతా వేదనకు గురవుతూ ఇంటి నుంచి ఒక అడుగు బయటకు వేస్తే ఏమవుతుందోననే తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు.

న్యూజిలాండ్ మంచి ఆదర్శం

న్యూజిల్యాండ్​లో కరోనా నుంచి ఏర్పాటుచేసిన హెచ్చరికల బోర్డులు

ఇలాంటి భయానక వాతావరణంలో జీవిస్తున్న మనకు న్యూజిలాండ్ మంచి ఆదర్శం. జీరో యాక్టివ్ కేసులు నమోదైన ఏకైక దేశంగా ఉంటూ కరోనా నివారణ దాదాపు అసాధ్యం అన్న దేశాలకు కనువిప్పుకలిగేలా ప్రపంచ దేశాలకు ఒక సందేశాన్ని పంపిస్తూ తన అనుభవాల నుంచి తగిన గుణపాఠాలు ఇప్పటికైనా నేర్చుకోవచ్చని నిరూపించగలిగింది. అంతేకాకుండా ప్రస్తుత కర్తవ్యాన్ని మరచి భవిష్యత్​లో కనుగొనే వ్యాక్సిన్ గురించి పగటి కలలు కనే నేటి నేతలు, ప్రజలకూ కివీస్ ప్రభుత్వం, అక్కడి ప్రజలు సాధించిన ఈ విజయం స్ఫూర్తి దాయకం. ఇదే స్ఫూర్తితో మిగతా దేశాలు కూడా ‘నేను సైతం’ అనే రీతిలో కఠోర నిబంధనలను అమలు చేయడం ద్వారా కరోనా మహమ్మారిని మన దరిదాపుల్లోకి రాకుండా చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే న్యూజిలాండ్ ప్రభుత్వం కరోనా నివారణకు ఎలాంటి చర్యలను తీసుకుంది? వాటికి అక్కడి ప్రజలు ప్రభుత్వానికి ఏవిధమైన సహాయ సహకారాలను అందించారనేది ఇప్పుడు మనం ముఖ్యంగా చర్చించాల్సిన అంశం.

న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డెన్ మాటల్లో చెప్పాలంటే జూన్ 8 నుంచి ఆ దేశంలో కరోనా యాక్టివ్ కేసులు జీరో అని, అయితే ఇంతటితో కరోనా వ్యాప్తిని నేటివరకూ అరికట్టగలిగామని, కానీ ఈ మహమ్మరిని సమూలంగా నివారించడమనేది కొంత కాలవ్యవధిని బట్టి కాదనీ, దీని నిర్మూలన కోసం ప్రభుత్వం, ప్రజలు తీసుకునే నిరంతర, నియమబద్ధ చర్యలపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. న్యూజిలాండ్ కరోనా వ్యాప్తిని ఏవిధంగా కట్టడిచేసిందనేది ఆ దేశానికి చెందిన ఇద్దరు రోగనిరోధక విజ్ఞాన శాస్త్రవేత్తల మాటలో చెప్పాలంటే ఫిబ్రవరి 28 నుంచి ఆ దేశంలో మొదలైన కరోనాను జూన్ 8 నాటికీ పూర్తిగా కట్టడి చేయగలిగారు. మార్చి చివరినాటికి రోజుకు గరిష్టంగా 146 కరోనా పాజిటివ్ కేసులు ఉన్న ఆ దేశంలో ఏప్రిల్ రెండవ వారంలోనే అత్యల్ప కేసులకు పడిపోయింది. ఇక రోజుకు 8,000 మందికి కరోనా నిర్ధారిత పరీక్షలు జరుపుతున్నప్పటికీ ఏప్రిల్ 26-30 మధ్యలోని ఐదురోజుల వ్యవధిలో కేవలం ఏడు కొత్త కేసులు మాత్రమే నిర్ధారణ కావడం వారి గొప్ప విజయంగానూ, ఆ దేశానికి కరోనా నిర్మూలనపై ఉన్న అంకితభావంగానూ చెప్పొచ్చు. అంతేగాక ఆదేశంలో ఇప్పటివరకూ మొత్తం 1487 కరోనా నిర్ధారిత కేసులు మాత్రమే ఉండి వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య కేవలం 20 మాత్రమే కావడం వారి నిబద్ధతకు దర్పణంలా కనిపిస్తోంది.

కట్టడి చేయలేకపోవడంతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట

వైరస్ వ్యాప్తి నియంత్రణకు పటిష్ట విధానాలను అమలుచేస్తున్న దేశాలైన సింగపూర్, కోరియా, ఆస్ట్రేలియా వంటి దేశాలు న్యూజిలాండ్ లాగా దాన్ని కట్టడి చేయలేకపోవడంతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్టను వేయలేకపోయారని తెలుస్తోంది. మొదటగా ఫిబ్రవరి 3 నుంచి చైనా నుంచి ఆ దేశానికి వచ్చే ప్రయాణికులను పూర్తిగా నియంత్రించింది. దేశవ్యాప్తంగా కేవలం 6 కేసులు మాత్రమే ఉన్నప్పటికి అప్పట్లో ప్రపంచంలోని అత్యంత కఠిన విధానాలు, కఠోర నిర్ణయాలతో మార్చి 15 నుంచి ఆ దేశానికి వచ్చే సందర్శకులను పూర్తిగా నియంత్రించగలిగింది. తదుపరి మార్చి19న ఆ దేశ సరిహద్దులను పూర్తిగా మూసివేసి తమ దేశ ప్రజలను ఎక్కడికీ ప్రయాణాలు చేయకుండా దేశ అంతర్గత ప్రయాణాలను పూర్తిగా నిషేధిస్తూ దీని నుంచి డాక్టర్లు, పోలీస్, ఆరోగ్య కార్యకర్తలు, వైద్యసిబ్బందికి మినహాయింపునిచ్చింది,

నేటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 26,192,015 కరోనా నిర్ధారిత కేసుల్లో ఒక్క అమెరికాలోనే 6,290,737 కేసులు ఉన్నాయని జాన్ హాప్సిన్స్ యూనివర్సిటీ వారు తెలిపారు. కాని దీనికి భిన్నంగా 5 మిలియన్ల జనాభా ఉన్న న్యూజిలాండ్ మార్చి మూడవ వారంలో విధించిన కరోనా లాక్ డౌన్ నిబంధనలకు అక్కడి ప్రజలు బద్ధులై ఉండడం వల్లనే వారి ‘go hard, go early’ అనే స్లోగన్ నుంచి నేడు సంపూర్ణ కరోనా ఫ్రీ దేశంగా మార్చగలిగింది. న్యూజిలాండ్ ప్రభుత్వం స్టేజి-3 లాక్ డౌన్ మార్చి 23న ప్రవేశపెట్టింది. ఆ లాక్ డౌన్ తో అనవసర వ్యాపారాలు మూసివేయడమేగాక దేశీయ విమాన సర్వీసులను విచక్షణతో నిషేధించారు. దీనికీతోడు అన్ని సభలు, సమావేశాలను రద్దుచేశారు. అటుతర్వాత అమలుపరచిన స్టేజి-4 లాక్ డౌన్ అత్యంత కఠిన ప్రభ్యుత్వ విధానాల వల్ల ప్రజలు తమకు తాము నియంత్రించుకుంటూ వచ్చారు. ఈ లాక్ డౌన్ వల్ల నిత్యావసరాల దుకాణాలు, ఆసుపత్రులు, ఫార్మసీలు, పెట్రోలుబంకులకు మాత్రమే అనుమతినిస్తూ వాహన ప్రయాణాన్ని పూర్తిగా కట్టడి చేయగలిగారు.

న్యూజిలాండ్ ప్రభుత్వం ఎంచుకున్న 5 ముఖ్య రిస్క్ మేనేజిమెంట్ విధానాలు నేడు ఆదేశాన్ని కరోనా ఫ్రీ దేశంగా మార్చాయనడానికి మరో బలమైన కారణంగా చెప్పవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా దేశంలోని ప్రతిఒక్కరూ ఫ్యాబ్రిక్ పేస్ మాస్కులను ధరించాలనే నిబంధనను దేశవ్యాప్తంగా కఠినంగా అమలుచేయడం అనేది వారి మొదటి విధానం. దీనికితోడు అనారోగ్యంతో ఉన్నవారు, 60 ఏళ్లకు పైబడ్డవారిని ఇంట్లోనే ఉంచడంలో ఆ ప్రభుత్వం పూర్తిగా సఫలమైంది. అక్కడి ప్రజలందరికీ ఆరోగ్య నియమాలైన భౌతిక దూరాన్ని నిక్కచ్చగా పాటించడంతో పాటు ఎక్కడా గుంపులుగా జనం గుమిగూడకపోవడం, తరచుగా చేతులు కడుక్కోవడం, మోచేతుల్లోకి దగ్గడం, హ్యాండ్ శానిటైజర్లను విరివిగా వాడడం అనే విషయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి వారికి ఆరోగ్యం పట్ల తీసుకొనే ముఖ్య జాగ్రత్తలను విధిగా పాటించేట్లు చేయడంలో అనతికాలంలోనే వారిని చైతన్యవంతులను చేయగలిగారు.

ఇకపోతే సరిహద్దు నిర్వహణకై సైన్స్ ఆధారిత విధానాన్ని అమలుచేయడం వారి మూడవ విధానంగా చెప్పవచ్చు. విదేశాలలో ఉండి, తమ దేశానికి వచ్చే దేశీయులను 14 రోజులు క్వారంటైన్ లో ఉంచడం. ఈ విధానంలోనే మరో పాలసీ క్వారంటైన్-ఫ్రీ ఎంట్రీ. దీనిని కరోనా ప్రభావం ఏమీలేని పసిఫిక్ ద్వీపదేశాలైన సమోవా, టోంగా, ఇతర దేశాలైన తైవాన్, ఫిజీతోపాటు వివిధ ఆస్ట్రేలియా రాష్ట్రాలవారు ఈ కేటగిరీ కిందకు వస్తారు. ఈ విధమైన సైన్టిఫిక్ స్టడీ ఆధారంగా సరిహద్దు నిర్వహణపై సమగ్ర విధానాన్ని అమలుపరిచారు. ఇటువంటి చర్యల వల్ల కూడా కరోనా నియంత్రణ సాధ్యమైందని న్యూజిలాండ్ ప్రభుత్వం నిరూపించింది. ఇక నాలుగో విధాన నిర్ణయమేంటంటే జాతీయ ప్రజారోగ్య ఏజెన్సీని ఏర్పాటు చేయడం. వ్యాధి నియంత్రణ, నివారణకు పాటుపడే జాతీయ ప్రజారోగ్య వ్యవస్థ అతివేగంగా కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో తైవాన్ దేశాన్ని కివీస్ రోల్ మోడల్ గా తీసుకుంది. ఇలాంటి ఏజెన్సీని ఏర్పాటు చేయడం ద్వారా న్యూజిలాండ్ కరోనా నివారణలో సత్ఫలితాలను రాబట్టగలిగింది. కఠోరంగా పాటించి అత్యంత ఆరోగ్యవంతమైన దేశంగా మన భారతదేశాన్ని తయారుచేసే క్రమంలో ప్రపంచానికి మనదేశ ప్రజల, ప్రభుత్వ అంకిత భావాన్ని, అకుంఠిత దీక్షను దశదిశలా వ్యాపింపజేయవచ్చనే విశ్వాసంతో ప్రతిఒక్కరూ దీనికి కంకణబద్ధులై, ఇదే తమ ప్రధమ కర్తవ్యంగా భావించి న్యూజిలాండ్ తరహా కరోనా రహిత దేశంగా భారతదేశాన్ని మార్చడానికి నిరంతర కృషి చేస్తారని ఆశిద్దాం.

:: డాక్టర్ పారుపల్లి శ్రీనివాసరావు (శ్రీశ్రీ)
ఆంగ్ల ఆచార్యులు
(రచయిత తెలుగు, ఛాంపియన్, ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ రికార్డ్స్ గ్రహీత)
సెల్​: 9618300450
Email: vasupsr@yahoo.com