Breaking News

ఓమానీయుల మర్యాద భలే

కప్పు కాఫీ.. గుప్పెడు ఖర్జూరం
  • బిడ్డపుడితే ఖర్జూరపు మొక్కనాటే ఆచారం
  • సంప్రదాయ పద్ధతుల్లో పంట సాగు

ఓమానీయులు.. వారి సంప్రదాయం ప్రకారం ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం మొదటిగా అరబిక్ కాఫీతో పాటు ఖలాస్ డేట్స్ ఇస్తారు. అలా వారి ఆహారంలో భాగమైంది ఖర్జూరం. అరబ్​ దేశాల్లో ఎక్కడ చూసినా ఈ తోటలు విరివిగా కనిపిస్తాయి. బిడ్డ పుడితే శుభసూచకంగా ఖర్జూరపు మొక్కను నాటుతారు. ఖర్జూరపు విశిష్టత.. ఓమానీయుల సంప్రదాయాలను తెలుసుకుందాం..

ఖర్జూరం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేవి అరబ్ దేశాలు. ఎడారి ప్రాంతంలో అధికంగా ఈ పంట పండుతుంది. ఇక్కడున్న అధిక ఉష్ణోగ్రత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొండ ప్రాంతం, చౌడునేలకు ఈ పంటకు అనువైంది. ఇది ఓమాన్​ దేశపు ప్రధాన వ్యవసాయ పంట. మొత్తం వ్యవసాయ భూమిలో 80 శాతం పండ్లతోటలైతే అందులో 50శాతం ఖర్జూరపు పంటనే పండిస్తారు. ఈ పంటను పండించే దేశాల్లో ఓమాన్ 8వ స్థానంలో ఉంది. ఏడాదికి 260,000 మిలియన్​టన్నుల దిగుబడి వస్తుంది. సుమారు 70లక్షల చెట్లు 250 మంది పెద్దరైతులు ఉన్నారు. ఒక్కో రైతువేల ఎకరాల్లో సాగుచేస్తుంటారు. ఇప్పటికీ ఇక్కడ పురాతన, సంప్రదాయ పద్ధతులను పాటిస్తుంటారు. పండించిన పంటలో సగం ఇక్కడ ప్రజల వినియోగం, మిగతాది పశువుల ఆహారంగా వినియోగిస్తుంటారు. కేవలం మూడుశాతం పంటను మాత్రమే ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇక్కడి ప్రజల ముఖ్యమైన ఆహారపు పంట ఇది. డేట్ సిరప్, డేట్ షుగర్, ఉపపదార్థాలు హల్వా, స్వీట్స్, బిస్కేట్స్, బ్రేడ్ వెరైటీస్ అలా చాలా రకాల వాటిని తయారు చేస్తుంటారు.

వారసత్వపు పంట
ఓమానీయుల సంప్రదాయం ప్రకారం ఇంట్లో బిడ్డ పుడితే ఖర్జూరపు మొక్కను నాటుతారు. ఖర్జూరపు చెట్టు, మనిషి వయసుతో సమానమని భావిస్తారు. యుక్త వయసులో ఉన్నవారు ఉద్యోగరీత్యా పట్టణాల్లో నివాసం ఉండేవారు సంప్రదాయపు సాగు చేస్తుంటారు.
పంటసాగు విధానం
ఖర్జూరపు ఆడ, మగ అని రెండు రకాలు ఉంటాయి. పోలినేషన్ పద్ధతి ద్వారా మగ చెట్టుపూలను ఆడ చెట్టులోకి ప్రవేశింపజేస్తారు. ఇది మూడు నాలుగు సార్లు చేస్తారు. ఈ ప్రక్రియకు నైపుణ్యం ఉన్న కూలీల అవసరం ఉంటుంది. పోలినేషన్ జరిగి ఆడ చెట్టుకు పిందెలు పడిన తర్వాత అవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వెంటనే ఆ గుత్తిని కిందకు వేలాడదీస్తారు. ఇలా ఒక్కో చెట్టుకు ఐదారు గుత్తులు ఉంటాయి. ఒక్కోగుత్తి సుమారు 30, 40 కేజీలు ఉంటుంది. వేసవికాలం మొదలు పిందెలు కనిపిస్తాయి. ఖర్జూరపు చెట్టును చూడగానే చుట్టూ గుత్తులుగా వేలాడి కనిపిస్తాయి. అవి సహజంగానే అలా ఏర్పడ్డాయని భావిస్తాం కానీ అలా కాదు.. గుత్తి గుత్తికి మధ్య దూరం పాటించి కిందకు వేలాడదీస్తారు. అవి పిందెలు పెరిగి పెద్దవిగా జూన్ వచ్చేసరికి పసుపు రంగులోకి మారుతాయి. పండిన పండు కిందపడకుండా గుత్తిని కోయడానికి వీలుగా ప్రతి గుత్తికి ఒక వల చుడతారు. జులై, ఆగస్టు నెలాఖరు నాటికి ఖర్జూరపు పంట గోల్డ్, బ్రౌన్​కలర్​లోకి మారుతుంది. చీడపీడ ఆశిస్తే ఆర్గానిక్​ఎరువు కొడతారు. కొండలు, అక్కడక్కడ ఉన్న నీటిబావుల నుంచి నీటిని చిన్న చిన్న కాల్వల ద్వారా ఖర్జూరపు చెట్లకు నీళ్లను పారిస్తారు. ఖర్జూరపు చెట్టు కాండంను తలుపులు, స్తంభాలకు వివిధ రకాల ఫర్నీచర్ వస్తువులు, తడికెలుగా వాడతారు.
ఖర్జూరపు రకాలు
ఒమాన్ లో సుమారు 250 రకాల ఖర్జూరపు వెరైటీస్ ఉన్నాయి. అందులో ముఖ్యమైంది, విరివిగా దొరికే వాటిలో మొదటిది ఖలాస్ డేట్స్. ఓమానీయులు వారి సంప్రదాయం ప్రకారం ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం మొదటిగా అరబిక్ కాఫీతో పాటు ఈ ఖలాస్ డేట్స్ ఇస్తారు. వీటి తీపిదనం మధ్యస్తంగా ఉంటుంది. ఈ డేట్ వెరైటీ పచ్చిదైతే బలాః, కొంచెం పండినప్పుడు రుతబ్, బాగా పండినప్పుడు తమర్ అని పిలుస్తుంటారు. చాలా మెత్తగా, పీచుతో మంచి బంగారపు వన్నెలో ఉంటుంది.. అందుకే వీటిని బంగారం పండ్లు అని కూడా పిలుస్తుంటారు. ఇక రెండో రకం కునైజీ.. ఇది సెప్టెంబర్​మాసంలో వస్తుంది. ఇవి చాలా తీయటి పండ్లు.

ఓమానీయుల జీవనశైలి
మార్నింగ్​కాఫీ విత్ డేట్స్ తో ప్రారంభమవుతుంది. హల్వా ప్రత్యేకం. డేట్స్ హల్వా ఓమానీయుల సంప్రదాయపు వంట. హల్వా అంటే అరబిక్​భాషలో స్వీట్ అని అర్థం. హల్వా తయారీలో బాదం పప్పు, పంచదార, బెల్లం పాకం, రోజ్ వాటర్, కుంకుమపూవు, నెయ్యి, ఇలాచీలు, ఖర్జూరపు పేస్ట్​వేస్తారు. ఈ హల్వా చాలా రుచికరంగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలని అనిపిస్తుంది. ఓమాన్​లో హల్వా తయారీ కంపెనీలు చాలా ఉన్నాయి. ఓమనీయులు, టూరిస్టులు ఓమన్​ డేట్స్​, హల్వా తినకుండా వెళ్లరు. ఏడాదంతా డేట్స్​కు గిరాకీ ఉంటుంది. కేజీ ఖలాస్ డేట్స్ ఓమన్​రియాల్ ఉంటుంది. క్వాలిటీ బట్టి రేటు మారుతుంది. రంజాన్ మాసంలో విరివిగా దొరుకుతాయి.
ఖర్జూరం.. బలవర్ధకం
ఖర్జూరపు పండ్లలో విటమిన్స్​, ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. చాలా రకాల వ్యాధులకు ఇది మందుగా పనిచేస్తుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా బూస్ట్​అప్ ఇస్తుంది. ఓమనీయులు మట్టిపాత్రల్లో నిల్వచేస్తారు. దీంతో ఖర్జురాలు ఏళ్లతరబడి ఉంటాయి. ఇదివరకు ఎడారి ప్రాంతంలో ప్రదేశాలు దూరంగా ఉండేవి. ప్రయాణం కష్టంగా ఉండేది. శారీరక శ్రమ కూడా ఉంటుంది.. అందుకే శక్తి కోసం ఈ ఖర్జూర పండ్లు ఓమానీయుల ప్రధాన ఆహారంగా మారింది.


:: ఉమా సావిత్రి వేపా,
రచయిత్రి, మస్కట్

(సారథికి ప్రత్యేకం)