Breaking News

ఒ’మనే’శ్వరుడు.. వైభవ దేవుడు

  • ఒమాన్​లో ఏకైక శైవమందిరం
  • లింగరూపంలో పరమశివుడు
  • ప్రత్యేక పర్వదినాల్లో విశేషపూజలు
  • దర్శించుకున్న భారత ప్రధాని మోడీ

సుల్తానేట్ ఆఫ్ ఒమాన్ దేశంలో ఒకే ఒక్క శైవ మందిరం మోతీశ్వర స్వామి ఆలయం. ఇక్కడ ఆ పరమ శివుడు లింగరూపంలో అత్యంత వైభవోపేతంగా విరాజిల్లుతున్నాడు. భక్తుల కోర్కెలు నెరవేర్చి కొంగుబంగారమై వెలుగొందుతున్నాడు. ప్రశాంతమైన వాతావరణం మధ్య అరేబియా మహాసముద్రం తీరాన, మనకు ఆ పరమశివుడు ఎంతో సుమనోహరంగా దర్శనమిస్తున్నాడు.

ఆలయాన్ని కట్టించింది ఇండియన్లే
సుమారు 125 ఏళ్ల క్రితం ఇండియాలోని గుజరాత్ కచ్​ప్రాంతం నుంచి భాటియా కుటుంబానికి చెందిన కొందరు వ్యాపార అవసరాల రీత్యా అరేబియా సముద్రం మీదుగా ఒమాన్, మస్కట్ ప్రాంతాలకు వచ్చారు. ఇక్కడే స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకుని వ్యాపార కార్యకలాపాలు కొనసాగించారు. ఆ సమయంలో ఆ పరమశివుడికి మందిరం కట్టించాలన్న ఆలోచనతో తోచినంత ధన సహాయం, అప్పటి సుల్తాన్ రాజు సహకారం, స్థానిక వనరులతో నిర్మాణపనులు చేపట్టారు. ఉత్తరభారతంలో ఉన్న దేవాలయాల నమూనాల తరహాలో ఈ క్షేత్రం రూపుదిద్దుకుంది. నాటి నుంచి నేటి వరకు హిందువులు ఈ ఆలయాన్ని దర్శించుకుని శివయ్యను పూజిస్తున్నారు.
ముఖ్యమైన పర్వదినాల్లో..
ఇక్కడి ఆలయంలో వెలిసిన పరమశివుడిని దర్శించుకోవడం ద్వారా మనసుకు ప్రశాంతత చేకూరుతోంది. ఈ పుణ్యక్షేత్రం సుల్తాన్ రాజు గారి కోట పక్కనే ఉంది. కోట ప్రధాన ప్రాకారం గుండానే గుడికి వెళ్లేందుకు దారి ఉంది. సోమ, మంగళ, శుక్ర, శనివారాల్లో శివుడు, హనుమంతుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేస్తుంటారు. అలాగే ఇక్కడ ముఖ్యమైన పండగలు, ఉత్సవాలు, వసంత పంచమి, శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి, శ్రావణమాసం, గణేష్ చవితి, ఇహ శివరాత్రి పర్వదినాన్ని కన్నులపండువగా జరుపుకుంటారు. ఈ సమయంలో సుమారు 20వేల మంది భక్తులు ఆ పరమశివుడిని దర్శించుకుంటారు. మోతీశ్వర స్వామి ఆలయ ఆవరణలో రెండు చిన్న దుకాణాలు ఉన్నాయి. అక్కడే ఆ పరమశివుడికి సమర్పించుకోవడానికి అవసరమైన పూజాసామగ్రి దొరుకుతుంది. ఇక్కడ షాపులు నిర్వహించేవారు, శైవక్షేత్రం కాపలాదారులంతా స్థానికంగా నివసించే అరబ్బులే కావడం విశేషం..

ఎన్నో విశిష్టతలు
ఆలయంలోకి ప్రవేశించగానే ప్రాంగణంలో ఎడమ వైపున పెద్దరావి చెట్టు ఉంది. అక్కడే ఒక గోముఖ ఆకారంలోనుంచి వచ్చే నీటి ధార కింద చిన్నకుండి, ఎదురుగా మారేడు, ఆలయం కుడివైపున బిల్వవృక్షం, కొబ్బరికాయలు కొట్టేందుకు ప్రత్యేకస్థలం, ప్రసాదం కౌంటర్, లోపలికి ప్రవేశించే ముందు ఒక బావి ఉంది. పైన ఇనుప కవచంతో కప్పబడి ఉంటుంది. లోపల కొబ్బరి ఊట మాదిరిగా నీటిధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆలయం లోపల వెళ్లగానే మనకు మూడు చిన్నచిన్న గుళ్లు కనిపిస్తాయి. ముందుగా మనకు ఆదిమోతీశ్వర మహాదేవ్ కనిపిస్తాడు. లింగేశ్వరుడికి ఎదురుగా నందీశ్వరుడు, లింగాకారంలో పైన సర్పతొడుగు, వెండికవచం ఉంటుంది.

నిత్య అభిషేకప్రియుడు
గుడిలోపల మొత్తం ఏసీని బిగించారు. లోపలికి కాలు అడుగు పెట్టంగానే హిమమంతా చల్లగా ఉంటుంది. రేనోవేషన్​లో భాగంగా వాస్తుశాస్త్రరీత్యా ఇటీవల నిర్మించిన మోతీశ్వర మహాదేవ్ మందిరం ఉంటుంది. ఆ తర్వాత మూడవ గుడి హనుమాన్ గుడి, రాతి విగ్రహం, ఆ పక్కనే చిన్న శనీశ్వరుడి విగ్రహం ఉంటుంది. హనుమాన్ కు ఎదురుగా ఒక పెద్ద సీతారాముల చిత్రపటం, అక్కడే చిన్న నీటి ఫౌంటెన్ ఉంది. గుడి మొత్తం దేదీప్యమానంగా విద్యుత్ దీపాల వెలుగుల్లో వెలుగుతోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఆ పరమేశ్వరుడికి పవిత్రమైన అగ్ని హారతి రూపేణా శుద్ధమైన, పావనమైన నీళ్లు, పాలు, పూలు, బిల్వపత్రాలు, ప్రసాదం సమర్పిస్తారు. చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవడానికి చుట్టూ చిన్న ఖాళీప్రదేశం ఉంది. ఆలయం ప్రాంగణంలో సేదదీరడానికి చిన్న చిన్న అరుగులను వేసి ఉంచారు. ఆలయ ఆవరణలో ఎడమ వైపున కొద్దిదూరంలో ఒక పెద్దహాలు ఉంది. ఇక్కడే భజనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు, వ్రతాలు, ధ్యానం వంటి చేస్తుంటారు.
దర్శించుకోవడం ఎలా..?
భారత్​నుంచి వెళ్లే భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే ముఖ్యంగా పాస్​పోర్ట్, ఒమాన్ దేశపు విజిట్ వీసా ఉండాలి. కొంత రుసుము కడితే ట్రావెల్ ఏజెన్సీవాళ్లు అన్ని వసతులు సమకూరుస్తారు. సులువైన విమాన మార్గం ఉంది. ఇండియాలోని అన్ని ముఖ్యమైన పట్టణాల నుంచి మస్కట్ కు విమాన సర్వీసులు ఉన్నాయి. ఎయిర్ ఇండియా, ఒమాన్ ఎయిర్, ఇండిగో.. ఇలా పలు విమానయాన సంస్థల విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మస్కట్ ఎయిర్​పోర్ట్​నుంచి టాక్సీలో ఆలయం వరకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి 35కి.మీ. దూరంలో ఉంటుంది. అరగంటలో అక్కడికి వెళ్లవచ్చు. ఈ ఆలయంతో పాటు దేశంలోని చుట్టుపక్కల రమణీయ ప్రదేశాలను సందర్శించాలంటే లక్ష రూపాయలు ఖర్చవుతాయి.

దర్శించుకున్న ప్రధాని మోడీ

2018 ఫిబ్రవరి 12న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒమాన్ పర్యటనలో భాగంగా ఆది మోతీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఎన్నో విశిష్టతలు ఉన్న రమణీయ క్షేత్రాన్ని మీరు కూడా దర్శించుకోండి.

:: ఉమా సావిత్రి వేపా,
(రచయిత్రి)
మస్కట్
(సారథికి ప్రత్యేకం)