Breaking News

ఏడిస్తే పోయినవారు తిరిగొస్తారా?

ఏడిస్తే పోయినవారు తిరిగొస్తారా?

అన్నింటిని పరిత్యజించి మోక్షానికి వెళ్లవలసిన ఒక యోగి, ఒకనాడు మండుటెండలో వెళ్తూ ఎండకు ఓర్చుకోలేక, చెప్పులు కుట్టే ఓ వ్యక్తి దారిలో పెట్టిన చెప్పులపై కొంతసేపు నిలబడ్డాడు. ఆ మాత్రం నిలబడినందున, ఆ రుణం తీర్చుకోవడానికి మరోజన్మలో ధారానగరంలో పరమేశ్వరి, సోముడు అనే దంపతులకు సునందుడు అనే కొడుకు పుట్టాడు. జాతకం చూపిస్తే పెద్దలు ఆ తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేశారు. ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉంటాడు. ‘వాడి చేతి నుంచి పైసా కూడా తీసుకోకండి. అతడికి మీరే అన్నీ ఇస్తూ ఉండండి’ అని చెప్పారు. నాటి నుంచీ తల్లిదండ్రులు వాడి నుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు. పూర్వజన్మ గుర్తున్నందున ఆ పిల్లవాడు వారి రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.

ఒకరోజు రాత్రి రాజభటుడైన తన తండ్రికి బదులుగా తాను రాజనగరికి కాపలా కాయవలసి వచ్చింది. అప్పుడు ప్రతి జాముకు ఒకసారి ఆ యువకుడు నగర ప్రజలను హెచ్చరిస్తూ హితవు ఒకటి చెబుతుండేవాడు. రాజుగారు మారువేషంలో తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడని గుర్తిస్తాడు. మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్లి రాత్రి తాను అన్నీ విన్నానని, తన మనసు ప్రశాంతత పొందిందని అంటాడు. పల్లెంలో వెంట తెప్పించిన ధనాన్ని అతనికి అందిస్తాడు. అతను వెంటనే ఆ ధనరాశిని తల్లికి ఇవ్వగా, ఆమె పుత్రోత్సాహంలో నియమం మరిచి ఆ పల్లెం అందుకుంటుంది. వెంటనే అతడు తనువును విడిచి ముక్తిపొందుతాడు. తల్లిదండ్రులు దుఃఖిస్తుండగా రాజు ఆ యువకుడు రాత్రి కావలి కాసిన సమయంలో చెప్పిన ఈ క్రింది ఉపదేశాలను వినిపించి ఓదారుస్తాడు.


మాతా నాస్తి, పితా నాస్తి,
నాస్తి బంధు సహోదరః!
అర్థం నాస్తి, గృహం నాస్తి,
తస్మాత్ జాగ్రత జాగ్రత!!

తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనం, ఇల్లు ఇవి అన్నియూ మిధ్యయే. ఇవి ఏవియూ నిజంగా లేవు. కావునా ఓ మానవులారా, సావధానులై ఉండండి.


జన్మ దుఃఖం, జరా దుఃఖం,
జాయా దుఃఖం పునః పునః !
సంసార సాగరం దుఃఖం
తస్మాత్ జాగ్రత జాగ్రత !!

ఈ జన్మ, వృద్ధాప్యం, భార్య, సంసారం ఇవన్నియూ దుఃఖ భరితములు. తిరిగి మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. కావునా ఓ మానవులారా, సావధానులై ఉండండి.


కామః క్రోధశ్చ, లోభశ్చ
దేహే తిష్ఠతి తస్కరాః!
జ్ఞాన రత్నాపహారాయ
తస్మాత్ జాగ్రత జాగ్రత!!

కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించేందుకు మన దేహంలో దాగి ఉన్న దొంగలు. కావునా ఓ మానవులారా, సావధానులై ఉండండి.


ఆశయా బధ్యతే జంతుః
కర్మణా బహు చింతయా!
ఆయుక్షీణం న జానాతి
తస్మాత్ జాగ్రత జాగ్రత!!

ఈ మనుషులు ఎప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో జీవితాలు గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించరు. కావునా ఓ మానవులారా, సావధానులై ఉండండి.


సంపదః స్వప్న సంకాశాః
యౌవనం కుసుమోపమ్!
విధుఛ్చచంచల ఆయుషం
తస్మాత్ జాగ్రత జాగ్రత!!

మన సంపదలన్నియూ ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు. యవ్వనం పూలతో సమానం అంటే ఎప్పుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపు తీగవలె చంచలమైంది. కావునా ఓ మానవులారా, సావధానులై ఉండండి.


క్షణం విత్తం, క్షణం చిత్తం
క్షణం జీవితమావయోః
యమస్య కరుణానాస్తి
తస్మాత్ జాగ్రత జాగ్రత

ధనం, బుద్ధి, జీవితం ఇవన్నియూ క్షణభంగురములు. మన ప్రాణములను హరించేందుకు వేచియున్న యముడు ఏ మాత్రం దయజూపడు. కావునా ఓ మానవులారా, సావధానులై ఉండండి.


యావత్ కాలం భవేత్ కర్మ
తావత్ తిష్ఠతి జంతవః!
తస్మిన్ క్షీణే వినశ్యంతి
తత్ర కా పరివేదన !!

ప్రపంచంలో తమ కర్మబంధం ఎంతవరకు ఉంటుందో, అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు. జనన మరణాలు జీవుని ధర్మం. దానికి బాధపడడం ఎందుకు.


ఋణానుబంధ రూపేణ
పశుపత్నిసుతాలయః!
ఋణక్షయే క్షయం యాంతి
తత్ర కా పరివేదన!!

గత జన్మ రుణానుబంధం ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడం ఎందుకు.. వృథా ప్రయాస.


పక్వాని తరుపర్ణాని
పతంతి క్రమశో యథా!
తథైవ జంతవః కాలే
తత్ర కా పరివేదన!!

పండిన ఆకులు చెట్టు నుంచి ఆకులు ఏ విధంగా రాలిపోతాయో అలాగే ఆయువు తీరినవారు మరణిస్తారు. దీనికి దుఃఖించడం ఎందుకు?


ఏకవృక్ష సమారూఢ
నానాజాతి విహంగమాః!
ప్రభతే క్రమశో యాంతి
తత్ర కా పరివేదన!!

చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షాన్ని ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులన్నీ చెట్టును విడచి తమ తమ ఆహార సంపాదనకు వెళ్లిపోతాయి. అలాగే బంధువులతో కూడిన మానవుడు కాలమాసన్నమైనప్పుడు తన శరీరాన్ని, ఇంటిని వదలి వెళ్లిపోతాడు. అందుకు బాధపడనవసరం లేదు.


ఇదం కాష్టం ఇదం కాష్టం
నధ్యం వహతి సంగతః!
సంయోగాశ్చ వియోగాశ్చ
కా తత్ర పరివేదన!!

ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరకు చేరతాయి. కొంతదూరం కలిసి పయనిస్తాయి తర్వాత విడిపోతాయి. అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచ ప్రవాహంలో కొంతకాలం సంయోగసుఖాన్ని, మరికొంతకాలం వియోగదుఃఖాన్ని అనుభవిస్తాడు. దానికి పరివేదన చెందనవసరం లేదు.
ఈ చివరి శ్లోకం భార్యాభర్తల గురించి సంకేతంగా చెప్పిందే! ఒక స్త్రీ, ఒక పురుషుడు వేర్వేరు కుటుంబాల్లో జన్మిస్తారు. వీరిద్దరూ జీవితమనే నదిలో కలుస్తారు. కొంతకాలం కలిసి బతుకుతారు. కాలం సమీపించడంతో ఒకరు కైవల్యం చెందుతారు, మరొకరు మరికొంతకాలం ఉండిపోతారు. ఇది సహజం, సృష్టి క్రమం. ఇందులో వేదన ఉండదని చెప్పలేదు. వేదన పడొద్దనీ చెప్పలేదు. సృష్టి సహజంగా వేదన తప్పదు. అందులోనూ ఇద్దరు చాలా ఏళ్లుగా కలిసి జీవించిన వారిలో ఒకరు జారిపోతే మరొకరు వేదన పొందక ఎలా ఉండగలరు? సహజమైన వేదనను అడ్డుకోలేం. దానిని అనుభవించాల్సిందే! మరి పరివేదన పనికిరాదన్నారు పెద్దలు. ఇది సహజం, సృష్టి క్రమం సుమా! ఏడిస్తే పోయినవారు తిరిగొస్తారా? రాగలరా? సాధ్యమా? సృష్టి క్రమం ఇలాగే జరుతుంది, వేదన తప్పదు, పరివేదన పడకు అన్నారు.
మనుషుల్లో చాలా రకాల బంధుత్వాలు ఉన్నాయి, కానీ భార్యాభర్తలది ప్రత్యేక బంధం, ఇలాంటిది మరొకటి లేదు. అందుకే వీరిగురించి మాత్రమే ప్రత్యేకంగా ఉదాహరించి చెప్పారు. దంపతులిద్దరూ ఒకసారి పోరు, ఎవరి సమయమొస్తే వారు జారిపోతారు, రెండవవారు మిగిలిపోతారు కొంతకాలం ఒంటరిగా.. ఇది సహజ పరిణామం, సృష్టి క్రమమని చెప్పి ఓదార్చడమే లక్ష్యం.
:: దిండిగల్​ ఆనంద్​శర్మ,
సీనియర్​ జర్నలిస్ట్​
సెల్​నం.96660 06418