Breaking News

మ్యాట్రిమోనిలతో జాగ్రత్త..!

సారథిన్యూస్, రామడుగు: సాంకేతికరంగం కొత్తపుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో మోసాలు సైతం అదే తరహాలో జరుగుతున్నాయి. తాజాగా ఓ యువకుడు తెలుగు మ్యాట్రిమోనిలో పరిచయమైన యువతి చేతిలో దారుణంగా మోసపోయాడు. అక్షరాలా నాలుగు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. రామడుగుకు చెందిన ఓ యువకుడికి తెలుగు మ్యాటిమోనిలో ఓ యువతి పరిచయమైంది. తాను అమెరికాలో ఉంటున్నానంటూ పరిచయం చేసుకున్న యువతి..పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. విలువైన ఎలక్ట్రానిక్​ వస్తువులు, డైమండ్​ రింగ్​, యుస్​ డాలర్స్​ పంపుతానని యువకుడిని నమ్మించింది. అనంతరం ఆ వస్తువులును కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారని.. అవి కావాలంటే అధికారులకు కొంత లంచం ఇవ్వాలని యువకుడిని నమ్మించింది. కస్టమ్స్​ అధికారులకు కట్టుందుకు రూ. 4,36,600 వేలు పంపాలని చెప్పింది. అది నమ్మిన యువకుడు దఫాల వారిగా ఆమెకు డబ్బులు పంపించాడు. ఎన్నిరోజులైనా వస్తువులు అందకపోవడంతో సదరు యువతికి ఫోన్​ చేశాడు. దీంతో మళ్లీ రూ. మూడు లక్షలు పంపాలంటూ ఆమె కోరడంతో.. అనుమానం వచ్చిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు రామడుగు ఎస్సై అనూష తెలిపారు.