ఇంటికే పరిమితమైన ముంబై క్రికెటర్లు
ముంబై: దేశవ్యాప్తంగా స్టేడియాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో చాలామంది క్రీడాకారులు ఔట్ బోర్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కానీ ముంబై క్రికెటర్లు రహానె, రోహిత్, పృథ్వీ మాత్రం ఇంకా ఇంటికే పరిమితమయ్యారు. ప్రాక్టీస్ చేసేందుకు వీళ్లు మరికొంతకాలం వేచి చూడక తప్పేలా లేదు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండడంతో ముంబై మొత్తాన్ని మహారాష్ట్ర గవర్నమెంట్ రెడ్ జోన్‌గా ప్రకటించింది. దీంతో స్థానికంగా ఉడే వాంఖడే, బాంద్రాకుర్లా, సచిన్ టెండూల్కర్ జింఖానా(కందివిలి) మైదానాలు ఇంకా మూతపడే ఉన్నాయి. ఇవన్నీ రెడ్ జోన్లలో ఉండడంతో తెరిచేందుకు అనుమతించలేదు. కేవలం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉన్న స్టేడియాలను మాత్రమే తెరుస్తున్నారు.
‘స్టేట్ గవర్నమెంట్ రూల్స్‌ను మేం స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నాం. స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఓపెన్ చేసేందుకు అవకాశం లేదు. కాబట్టి రోహిత్, రహానె ప్రాక్టీస్ చేసుకోవడానికి మరికొంత కాలం ఆగాల్సిందే’ అని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇస్తే అప్పుడు క్రికెట్ గురించి ఆలోచిస్తామని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సీనియర్ అధికారి అన్నాడు.