Breaking News

పెద్దల సభకు ఎవరు?

పెద్దల సభకు ఎవరు?
  • జాతీయస్థాయిలో పనిచేసే వారికే చాన్స్​
  • బండా ప్రకాశ్​ రాజ్యసభ సీటు ఖాళీ
  • ఎమ్మెల్సీ కవిత వెళ్తారని ప్రచారం
  • రాష్ట్ర రాజకీయాల వైపే ఆమె మొగ్గు
  • జూన్​లోమరో రెండు స్థానాలు ఖాళీ
  • రేసులో వినోద్​కుమార్, మోత్కుపల్లి, మండవ, తుమ్మల

తెలంగాణ నుంచి ఖాళీకానున్న రాజ్యసభ రేసులో ఎవరున్నారు. పెద్దల సభలో అడగుపెట్టాలని ఊవ్విళ్లూరుతున్న నేతలెవరు.. ఆశావాహుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉన్నా గులాబీ దళపతి ఎవరికి అవకాశమిస్తారనే చర్చ టీఆర్ఎస్​లో జోరుగా సాగుతోంది. ఈ అంశమే హాట్ టాపిక్ గా మారింది. అయితే జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పార్టీపరంగా చురుగ్గా పనిచేసే నేతలను ఢిల్లీ పంపాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది.

సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: సీఎం కేసీఆర్ రాజకీయంగా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరు అంచనా వేయలేని విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటారు. అందులో భాగంగానే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్​ను మొన్నటి మొన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా పోటీచేయించారు. ఆయనకు ఇంకా మూడున్నరేళ్ల పదవీ కాలం ఉన్నా అనూహ్యంగా ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. దీంతో బండ ప్రకాశ్ స్థానంతో ఎవరిని రాజ్యసభకు పంపిస్తారన్న చర్చ గులాబీ పార్టీలో జోరుగా సాగుతోంది. అయితే నిన్నటివరకు ఎమ్మెల్సీగా ఉన్న సీఎం కేసీఆర్​కుమార్తె కల్వకుంట్ల కవితను రాజ్యసభకు పంపుతారనే చర్చ నడిసింది. కానీ ఆమె రాష్ట్ర రాజకీయాలపైనే ఆసక్తి చూపడంతో పార్టీ అధినేత మళ్లీ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు.

చురుగ్గా పనిచేసే వారికే చాన్స్​

ఇక ఎమ్మెల్సీగా కవిత పోటీచేసే విషయంపై ఉత్కంఠ వీడటంతో ఇప్పుడు రాజ్యసభకు ఎవరు వెళ్లారనే చర్చ మొదలైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ, కాంగ్రెస్ పోరు హోరాహోరీగా జరిగే అవకాశం ఉండటంతో తమ రాజకీయ ప్రాబల్యం చాటేలా పనిచేయాలని సీఎం కేసీఆర్ అంచనా వేస్తున్నారని టాక్. అయితే టీఆర్ఎస్ అధికారం చేపట్టిన నాటినుంచి ప్రతి సందర్భంలోనూ టీఆర్ఎస్ అధికారిక మీడియా వ్యవహాలు చూస్తున్న దామోదర్ రావు పేరు వినిపిస్తూ ఉంటుంది. తాజా రాజకీయ పరిణామాలతో దామోదర్ రావును ఈసారి రాజ్యసభకు పంపిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బండ ప్రకాష్ ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఏకగ్రీవం కావడంతో ఆయన ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. రాజీనామా చేసిన ఆరునెలల్లోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు మరోరెండు రాజ్యసభ స్థానాలు కూడా జూన్​లో ఖాళీకాబోతున్నాయి. కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ధర్మపురి శ్రీనివాస్ స్థానాల్లో కూడా కొత్త వారికి చాన్స్ దక్కనుంది. అయితే వీటికి పెద్దసంఖ్యలో ఆశావాహులు పోటీ పడుతున్నారు.

రేసులో ఆ నలుగురు

కరీంనగర్ పార్లమెంట్ ​స్థానం నుంచి పోటీచేసి ఓడిన ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ను జాతీయ స్థాయి రాజకీయాల్లోకి పంపించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు గతంలో పార్టీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన అనుభవం ఉంది. పార్టీ వాయిస్ గట్టిగా వినిపిస్తారని అధినేత విశ్వసిస్తున్నారు. దీంతో ఆయనకు రాజ్యసభ గ్యారెంటీ అని ప్రచారం జరుగుతోంది. ఇక హుజూరాబాద్ ఎన్నికల ముందు బీజేపీకి రాజీనామా చేసి వచ్చిన సీనియర్ నాయకుడు, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు రాజ్యసభను ఆశిస్తున్నారట. తన సీనియారిటీ పరిగణలోనికి తీసుకొని అవకాశమిస్తే పార్టీ వాయిస్ ను బలంగా వినిపిస్తానని కేసీఆర్ ను కోరుతున్నారట. ఒకవేళ దళిత సామాజికవర్గం నుంచి అవకాశమిస్తే తన పేరును పరిశీలనలోనికి తీసుకోవాలని గులాబీ బాస్ కు విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గత లోక్ సభ ఎన్నికల ముందు నిజామాబాద్ కు చెందిన సీనియర్ నేత, మాజీమంత్రి మండవ వెంకటేశ్వర్ రావు ఇంటికి వెళ్లి మరీ సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పారు. ఆయన కూడా ఈసారి పెద్దలసభకు అవకాశమిస్తారనే ఆశతో ఉన్నారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆశావహులు సంఖ్య ఎక్కువగానే ఉంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని భావించినా భంగపాటు తప్పలేదు. దీంతో కనీసం రాజ్యసభకైనా పంపుతారన్న ఆశతో ఉన్నారాయన. మరోవైపు సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే తుమ్మల మాత్రం ఎమ్మెల్యేగానే పోటీచేయాలని యోచనలో ఉన్నారట. మొత్తానికి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలపై ఆశావహులు ఆశలుపెట్టుకున్నా గులాబీ బాస్​చివరి నిమిషం వరకు ఎవరికి చాన్స్ ఇస్తారన్నది సస్పెన్స్ ఉంటుంది. పెద్దలసభకు ఎవరెవరు వెళ్తారో మరికొంత సమయం ఆగాల్సిందే.