Breaking News

బెగ్గర్ల చేతిలో బాలల బతుకు చిత్తు

బెగ్గర్ల చేతిలో బాలల బతుకు చిత్తు
  • రేపటి పౌరుల భవిష్యత్ కు మప్పు
  • నల్లగొండలో చిన్నారులను ఎత్తుకుని భిక్షాటన
  • నిద్రపోవడానికి మత్తు మందు ఇస్తున్నట్లు ఆరోపణ

సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: చూడటానికి జిల్లాకేంద్రం. ఎప్పుడు చూసినా అధికారులు, పోలీసులు, రాష్ట్ర స్థాయి అధికార పార్టీ నేతలు రయ్ రయ్ మంటూ వెళుతుంటారు. ప్రధాన కూడళ్లలో చిన్నపిల్లల్ని సాకుగా చూపించి భిక్షాటన చేసే మహిళలే వారికి కళ్లకు కనిపించరు.  చూడటానికి పేద మహిళే అయినా, వారి చేతిలో రేపటి పౌరుల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయి. అభం శుభం తెలియని, పాలు మరువని పసికందులను చంకనేసుకుని బెగ్గింగ్ కు పాల్పడే మహిళలు నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో కనిపిస్తున్నారు. ఈ తతంగం మొత్తం శిశు సంక్షేమశాఖ అధికారుల దృష్టికి వచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు జిల్లావాసుల నుంచి వినిపిస్తున్నాయి. ఆరు నెలల నుంచి మూడేళ్ల బాలలు బెగ్గింగ్ మాఫియా చెరలో ఉండి, వారి జీవితాల్లో అంతులేని విషాదాన్నే మిగుల్చుతోంది. ఎటువంటి శారీరక శ్రమ కలగకుండా భిక్షాటన చేయడమే వృత్తిగా మలుచుకున్నారు కొంతమంది మహిళలు. నల్లగొండ జిల్లాకేంద్రంలో పసిపిల్లలను చంకనేసుకుని కిరాణా దుకాణాలు, టీస్టాళ్లు, బస్టాండ్ లు వంటి రద్దీగా ఉంటే ప్రాంతాల్లోనే భిక్షాటన చేస్తున్నారు.

మహిళలతో ఉండేది వారి పిల్లలేనా..

పిల్లల్ని చంకన వేసుకుని భిక్షాటన చేస్తున్న మహిళ దగ్గర కేవంలం 6 నుంచి మూడేళ్ల పిల్లల వరకే ఉంటున్నారు. భిక్షాటన చేస్తూ ఏళ్లకుఏళ్లుగా అదే వృత్తిలో కొనసాగుతున్నా, సంవత్సరాలు మారుతున్నా అదే వయస్సున్న పిల్లలు ఉంటున్నారు. వారి పిల్లలేనా.. లేదంటే అపహరించి ఇటువంటి వృత్తిలో కొనసాగింపచేస్తున్నారా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పేద పిల్లలు, మురికి వాడ ప్రాంతాల్లోని, పెళ్లికాని కొంతమంది యువతులు గర్భం దాల్చి, ఆసుపత్రుల్లోనే వదిలి వెళ్లేవారు లేకపోలేదు. గ్రామాల్లో పనులు లేక పట్టణాలకు వలస వెళ్లే వారి పిల్లలు అతి సునాయాసంగా అపహరణకు గురువుతున్నారు. పార్కుల్లోనూ వీధుల్లోనూ, జాతరలో, దేవాలయాల్లో, ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో పిల్లలు అపహరణకు గురయ్యే పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనల్లో ఎక్కువ శాతం బెగ్గిగ్ మాఫియా ఆకృత్యాలేననే అనుమానాలు రేకిత్తిస్తున్నాయి.

బెగ్గింగ్ మాఫియా ఆకృత్యాలు..

భిక్షాటన చేస్తుంటే పిల్లలు ఇబ్బంది కల్పించకుండా, మధ్యలో లేచి ఏడ్చి తమ సంపాదనకు అడ్డుకాకుడదని నల్లమందు, క్లోరోఫామ్, వంటి పధార్థాలను ఇచ్చి మత్తులోకి పంపిస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు ఎవరూ భిక్షం వెయ్యకుంటే పిల్నల్ని గట్టిగా గిచ్చి ఏడిపించి, పాలు సరైనా పోషకాహారం అందించలేకపోతున్నామని ప్రజలకు చెబుతూ బెగ్గింగ్ కు పాల్పడున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి మాఫియాపై పోలీసులు ఉన్నతాధికారులు స్పందించి, పిల్లలకు రక్షణ కల్పించాలని, మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి ఉపాధి కల్పించి మంచి బాటలో నడిపించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.