Breaking News

నల్లమట్టి కొట్టుడు బంద్​ పెట్టాలి

నల్లమట్టి కొట్టుడు బంద్​పెట్టాలి
  • రైతుల నోట్లల్లో మట్టి కొట్టొద్దు
  • బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన
  • నేతల అరెస్ట్…​ పోలీస్ స్టేషన్​కు తరలింపు

సామాజిక సారథి, బిజినేపల్లి: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు అక్రమంగా నల్లమట్టిని చెరువుల నుంచి తోడి ప్రాజెక్టుకు తరలింపు నిలిపివేయాలని నాగర్ కర్నూల్ బీఎస్పీ ఆధ్వర్యంలోమంగళవారం ఆందోళన నిర్వహించారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇన్​చార్జ్​బండి పృథ్విరాజ్ కార్యకర్తలతో బిజినేపల్లి మండలం మహాదేవునిపేట శివారులో నల్లమట్టిని తరలిస్తున్న ప్రాంతానికి చేరుకుని వాహనాలను అడ్డుకుని భైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగర్​కర్నూల్ నియోజకవర్గం అంటేనే భూకబ్జాలు, చెరువు శిఖం భూముల ఆక్రమణ, నల్లమట్టి దందాకు పేరుమోసిందని అన్నారు. పంచాయతీలకు ఎలాంటి పన్నులు చెల్లించకుండా కేవలం రాజకీయ నాయకుల ప్రోద్బలంతో కంపెనీ కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా గ్రామాలపై పడి చెరువుల్లో అక్రమంగా నల్లమట్టిని తరలించారని అన్నారు. ఇప్పటికే పాలెం పెంటోనిచెరువుపై అక్కడి రైతులు లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరుగుతోందని తెలిపారు. అయినా కూడా కంపెనీ నిర్వాహకులు అధికారపార్టీ అండదండలతో నందివడ్డెమాన్, మహాదేవునిపేట గ్రామాల్లో నల్లమట్టిని అక్రమంగా తవ్వి నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. నల్లమట్టి వాహనాలు నిత్యం ప్రధాన రహదారుల గుండా వెళ్లడంతో రోడ్లన్నీ పాడయ్యాయని, పలువురు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అధికారపార్టీ అండదండలతో అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ఈ విషయమై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలని డిమాండ్​చేశారు. అనంతరం వారిని అరెస్ట్​చేసి బిజినేపల్లి పోలీస్​స్టేషన్​కు తరలించారు.

బిజినేపల్లి పోలీస్​స్టేషన్​లో బీఎస్పీ నాయకులు