Breaking News

బీజేపీ ఘోర వైఫల్యం

బీజేపీ ఘోర వైఫల్యం
  • రైతులను చంపిన దుర్మార్గమైన ప్రభుత్వం
  • మతఘర్షణలతో పబ్బం గడిపే ఉన్మాదులు
  • ఇంత దిగజారిన కేంద్ర ప్రభుత్వాన్ని చూడలేదు
  • సాగనంపకుంటే శంకరగిరి మాన్యాలే
  • కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఓ దద్దమ్మ
  • యాసంగిలో కొనుగోలు కేంద్రాలు బంద్‌
  • కేబినెట్‌ భేటీ అనంతరం మీడియాతో సీఎం కేసీఆర్​

సామాజిక సారథి, హైదరాబాద్‌: పాలనారంగంలో అనేక వైఫల్యాలను మూటగట్టుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిందేనని సీఎం కేసీఆర్​ఉద్ఘాటించారు. ఈ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందన్నారు. దేశంలో ఆహారభద్రత కొరవడిందని, ఆహారసూచీలో ఇతర దేశాలతో వెనకబడిందన్నారు. కేంద్రం తీరువల్ల ప్రజలు శంకరగిరిమాన్యాలు పట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. నిరుద్యోగం పెరిగిందని, ఆహార కొరతలో అల్లాడుతున్నామన్నారు. రూ.లక్షల కోట్లు అప్పులు చేశారు. ఈ దేశంలో రైతుల సమస్యలు తీరాలంటే నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దించాల్సిందేనని చెప్పారు.

తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. కేబినెట్‌ భేటీ అనంతరం ఆయన మంత్రులు ఎస్.నిరంజన్‌ రెడ్డి, హరీశ్​రావులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. దేశ రైతాంగాన్ని కేంద్రప్రభుత్వం  గందరగోళానికి గురిచేస్తోందని విమర్శించారు. చిల్లర కొట్టు షావుకారుగా వ్యవహరిస్తోందని, ఆహార భద్రత సామాజిక బాధ్యత అన్న విషయాన్ని విస్మరించిందని చెప్పారు. నష్టం వస్తే కేంద్రం భరించాలని, నిల్వలు ఎక్కువైతే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు.

750మందిని పొట్టన పెట్టుకున్నారు..

బీజేపీ ప్రభుత్వం వచ్చాక రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని సీఎం కేసీఆర్​మండిపడ్డారు. 750మంది రైతులను పొట్టన పెట్టుకున్న తర్వాత సాగుచట్టాలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పిన దిక్కుమాలిన పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘13 నెలల పాటు కరోనాలో ఎండ, వానలో చస్తే ఆందోళన జీవులని అవమానపరిచారు. కొట్టి సంపమని హర్యానా సీఎంకు చెప్పి కారెక్కించి తొక్కించి సంపి చివరకు క్షమాపణలు చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నరు. మేం రైతుబంధువులం. నాశనమైన చెరువులను బాగుచేయలేదా కనపడుతలేవా? దా.. ఏ వూరికి వస్తవో.. ప్రాజెక్టులు మేం కట్టలేదా? ఆయకట్టు స్థిరీకరణ కాలేదా?. ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేయలేదా?’ అని సీఎం కేసీఆర్​ప్రశ్నించారు.

కేంద్రమంత్రి కిషన్​రెడ్డి చేతకాని దద్దమ్మ

ఢిల్లీకి వెళ్తే మొహం లేక తమకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని సీఎం కేసీఆర్​అన్నారు. ఇంత దిగజారిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు.  విభజన చట్టం ప్రకారం కేంద్రం సహకారం అందివ్వడంలేదు. ఏపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసినా ప్రాజెక్టులు నిర్మించాం. రైతులకు అండగా ఉంటామని కిషన్‌రెడ్డి అన్నారు. కిషన్‌రెడ్డికి దమ్ముంటే కేంద్రంతో బాయిల్డ్‌ రైస్‌ కొనించాలని సీఎం కేసీఆర్ సూచించారు. వరి విషయంలో కిషన్‌ రెడ్డి చేతకాని దద్దమ్మలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓ ఉన్మాదిలా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు.