Breaking News

అన్నదాతకు అండగా.. సేవే నిండుగా

అన్నదాతకు అండగా.. సేవే నిండుగా

సారథి న్యూస్, ములుగు: ఆమె ఓ ప్రభుత్వ అధికారిణి, ఆకుపచ్చ పెన్నుతో సంతకం చేసేంత హోదా, హలం పట్టి పొలంలో పనులు చేసేంత ఓపిక, రెండు జిల్లాలకు సబ్ రిజిస్ట్రార్ ఆమె.. క్షణం తీరిక లేకుండా తన విధి నిర్వహణలో బిజీగా గడిపే ఓ ఉత్తమ ఆఫీసర్​.. కానీ సెలవు దినాల్లో మాత్రం సేద్యం పనులు చేస్తుంటారు. ఎందుకో తెలుసా.. కర్షకుల విలువ ప్రపంచానికి చెప్పడానికే. ఆమె ఎవరో కాదు.. ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్. సమస్త జగత్తుకు అన్నం పెట్టడం కోసం వారి ఆకలిని మరిచిపోయి వ్యవసాయ పనులు చేస్తున్న కర్షకులే మన దేవుళ్లని అంటున్నారామె. ఆదివారం సెలవు దినం కావడంతో ములుగు జిల్లా జాకారం గ్రామంలో రైతు గండ్రత్ దామోదర్ వ్యవసాయ పొలంలో అరక పట్టి దున్నారు. కొద్దిసేపు కూలీలతో కలిసి వరి నాట్లు వేశారు.
రైతులకు అండగా ఉందాం..
ఈ సందర్భంగా తస్లీమా మాట్లాడుతూ.. ఆధునిక కాలంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, పంట పెట్టుబడి చేతికందక అన్నదాతలు ఆత్మబలిదానాలు చేసుకుంటున్నారని అన్నారు. వ్యవసాయమే దండుగ అని చాలా మంది రైతులు వ్యవసాయానికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అలా రైతులు వ్యవసాయానికి దూరమైతే మానవ మనుగడే కనుమరుగు అవుతుందని, ఇలాంటి తరుణంలో రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని సూచించారు. ఒకప్పుడు రైతు ఉండేవాడు అని చెప్పుకునే రోజులు రాకుండా ఉండాలంటే కర్షకులకు బాసటగా నిలవాలని తస్లీమా మహమ్మద్ అన్నారు.