Breaking News

ఇసుక రవాణాపై కఠినంగా ఉండాలే

ఇసుక రవాణాపై కఠినంగా ఉండాలే

సారథి ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై తహసీల్దార్లు కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ జి.రవి సూచించారు. అనుమతి లేకుండా ఇసుకను డంప్ చేసే స్థలాలను గుర్తించి భూ యజమానులపై కేసులు పెట్టాలని ఆదేశించారు. వాహనాలకు పెనాల్టీలు మాత్రమే విధించకుండా సీజ్ చేయాలన్నారు. కలెక్టరేట్​నుంచి జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లతో ఆయన జూమ్ మీటింగ్​లో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక రవాణాపై అధికారుల పర్యవేక్షణ ఉండాలని, అక్రమరవాణా చేసే వారిపై కఠినంగా వ్యవహరించి చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ కోసం వచ్చే ప్రతి దరఖాస్తును సరిగ్గా చూడాలని, ఎమ్మెల్యేల అనుమతుల కోసం తీసుకొని బడ్జెట్ ​ప్రకారం లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధరణి స్లాట్ బుకింగ్ ​సక్రమంగా జరిగినప్పటికీ మీసేవా కేంద్రాల్లో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తునట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, తహసీల్దార్లు పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఆఫీస్ ద్వారా ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని సూచించారు. చౌకబియ్యాన్ని రవాణా చేసే వారిపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. అలాంటి వారిని వెంటనే బైండోవర్​చేయాలన్నారు. ఆహారభధ్రత కార్డుల పంపిణీ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. సమావేశంలో జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు మాధురి, వినోద్ కుమార్, అన్ని మండలాల తహసీల్దార్లు, కలెక్టరేట్ పర్యవేక్షకులు పాల్గొన్నారు.