Breaking News

ప్రభుత్వాలు, ఎన్‌జీవోలకు సోనూసూద్ ​రిక్వెస్ట్​

ప్రభుత్వాలు, ఎన్‌జీవోలకు సోనూసూద్​రిక్వెస్ట్​

కరోనా కష్టకాలంలో రియల్ హీరో అనిపించుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్న సినీనటుడు సోనూసూద్ దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. పల్లె, పట్నం అనే తేడాలేకుండా మహమ్మారి వైరస్ వీరవిహారం చేస్తోంది. ఎంతోమంది కరోనా కాటుకు బలవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు సోనూసూద్‌ ఓ విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలబడాలని కోరారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో వీడియో ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహా ఎన్‌జీవోలకు ఆయన రిక్వెస్ట్ చేశారు. ‘8 నుంచి 12 సంవత్సరాలు వయసున్న ఎంతోమంది చిన్నారులు కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోతున్నారు. చాలా కుటుంబాల్లో తల్లో, తండ్రో లేకపోతే ఇద్దరూ చనిపోయి పిల్లలు అనాథలవుతున్నారు. అలాంటి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే నాకెంతో బాధేస్తోంది. కాబట్టి అలాంటి పిల్లలకు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్‌జీవోలు ఇలాంటి పిల్లలకు అండగా నిలబడి వారికి ప్రాథమిక విద్య నుంచి కాలేజీ విద్య వరకు ఉచితంగా అందించాలి. ఇలా ప్రభుత్వాలు ఓ రూల్‌ను తీసుకురావాలి’ అని సోనూసూద్‌ విజ్ఞప్తి చేశారు.