Breaking News

గుండాలకు ‘కాశీ’ విశిష్టత

గుండాలకు ‘కాశీ’ విశిష్టత

సామాజిక సారథి, వెల్దండ: దక్షిణకాశీగా పేరొందిన, స్వయంభుగా వెలిసిన గుండాల అంబా రామలింగేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మహాగణపతిపూజ, పూణ్యాహవాచనం, ధీక్షాధారణ, రక్షాబంధనం, యాగశాల ప్రవేశంతో ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. ఫిబ్రవరి 28న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు మార్చి 15వ తేదీ వరకు జరుగుతాయి. ఈనెల 1న మంగళవారం మహాశివరాత్రి సందర్భంగా ఏకాదశరుద్రాభిషేకం, అభిషేకం అలంకరణ, లలితా అష్టోత్తర కుంకుమార్చాన వంటి విశేషపూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు, అర్చకులు తెలిపారు. 2వ తేదీన మూలమంత్ర హవనం, వాస్తుమండపారాధాన, వాస్తు హవనం 3న రుద్రపారాయణం, 4న ఏకాదశ రుద్రాభిషేకం, 5న పుష్పరథోత్సం(చిన్నతేరు), 7న పెద్దరథోత్సవం(పెద్దతేరు), 8న వృషభవాహన సేవ, 9న హంస వాహన తెప్పోత్సవం వంటి విశేష కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. గుండాల అంబారామలింగేశ్వర ఆలయం శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారికి సుమారు ఏడు కి.మీ. దూరంలో ఉంది. వెల్దండ– చారకొండ మార్గం ఉంది. అటు వెల్దండ, ఇటు చారకొండ నుంచి ఆటోలు, బస్సు సౌకర్యం కూడా ఉంది.

గుండాలలోని గుండం, అమ్మవారి మూలవిరాట్​

ధగధగ వెలుగుల్లో ఆలయం
గర్భగుడి, శిఖరం, మహామండపం, ఆంజనేయస్వామివారి ఆలయం, పంచలింగ మండపాలు, ధ్వజస్తంభం, నవవిగ్రహాలును ప్రతిష్టింపజేశారు. అలాగే భక్తుల కోసం విడిది కేంద్రాలను ఏర్పాటుచేశారు. భక్తులకు దర్శనం కోసం ఆలయ పాలకవర్గం ఏర్పాట్లు చేసింది. క్యూ లైన్లు, స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్​దీపాలతో అలంకరింపజేశారు. కాగా, ఇక్కడ వెలిసిన గుండాల ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంది. ‘కాశీలో కర్రవేస్తే ఇక్కడ తేలుతుందని’ లోకోక్తి ప్రచారంలో ఉంది. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తే కాశీవిశ్వేరుడి సన్నిధిలో చేసినట్లేనని భక్తులు భావిస్తుంటారు. ఇక్కడి గుండంలో బండపొరల మధ్య నుంచి అన్నికాలాల్లోనూ నీటిఊట ప్రవహిస్తోంది. చల్లగా, కొబ్బరినీళ్లను తలపించే గుండం నీటి పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. ఇక్కడి గుండంలో మూడు మునకలు వేస్తేచాలు సకలపాపాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం. ఈ క్రమంలోనే గుండాల అంబా రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వేలసంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. వారికి ఇబ్బందులు కలగకుండా కొవిడ్​నిబంధనలు పాటిస్తూనే ఏర్పాట్లు చేశామని ఆలయ ధర్మకర్తల మండలి, దేవాలయ ఈవో ప్రసాద్, గుండాల సర్పంచ్​ మైసయ్య తెలిపారు.

One thought on “గుండాలకు ‘కాశీ’ విశిష్టత”

Comments are closed.