– బండి సంజయ్ ను కలిసిన దేవస్థానం చైర్మన్ ఈవో..
సామాజిక సారథి, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠంగా విరాజిల్లుతన్న అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర మరియు నవబ్రహ్మ ఆలయాల అభివృద్ధికి కేంద్ర పురాతత్వ శాఖ వారి నుండి సహకారం అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేయాలని కోరుతూ దేవస్థానం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆలయ ఈవో పురంధర్ కుమార్ మంగళవారం హైదరాబాదులో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కలిశారు. ఈ సందర్భంగా దేవస్థానం తరపున బండి సంజయ్ కు వినతి పత్రం అందజేశారు.ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాలకు పర్యాటకుల తాకిడి అధికమైందన్నారు. ఆలయాలను దర్శించుకున్న భక్తులకు అన్నదానం చేసేందుకు దేవస్థానంకు దగ్గర తగిన ఆర్థిక వనరులు మరియు దాతల సహకారం ఉన్నప్పటికీ , అక్కడ భక్తుల సంఖ్యకు తగ్గట్టు అన్నదాన భవన నిర్మాణానికి తగిన స్థలాన్ని ఇచ్చేందుకు కేంద్ర పురాతత్వ శాఖ అధికారులు నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల ఎంపి నిధుల నుండి దేవస్థానం ప్రాంగణంలో రెండు హైమాక్స్ లైట్లు ఇచ్చినప్పటికీ ఈ లైట్లు ఇక్కడ పెట్టేందుకు కేంద్ర పురాతత్వ శాఖ అధికారులు అభ్యంతరం చెబుతున్నారని బండి సంజయ్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ ఆలయంలో అన్నదాన సత్ర నిర్మాణానికి అలాగే ఇతరత్రా నిర్మాణాలకు అవసరమైన స్థలం ఉన్నప్పటికీ, ఇక్కడ కేంద్ర పురాతత్వ శాఖ నిబంధనలు అభివృద్ది పనులకు అడ్డువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పుష్కర ఘాటు ముందున్న ఖాళీ స్థలంలో అన్నదాన భవన సత్ర నిర్మాణానికి అనువైన స్థలం ఉంన్నారు. ఈ స్థలంలో భవన నిర్మాణం జరిగితే ప్రతిరోజు 500 నుండి 600 మందికి అన్నదానం చేసేందుకు దేవస్థానం మరియు దాతలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు.ఖాళీగా పిచ్చి మొక్కలతో పెరిగినఈ స్థలాన్ని దేవాదాయ శాఖకు అప్పగిస్తే అక్కడ పురాతత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగానే అధునాతనమైన పరిజ్ఞానంతో తాత్కాలిక షెడ్డు నిర్మాణం చేసి భక్త యాత్రికుల ఆకలి దప్పికలు తీరుస్తామని సూచించారు. ప్రస్తుతం బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయం తరహాలో మిగిలిన ఎనిమిది ఆలయాలు (నవబ్రహ్మాలయాలు) దేవాదాయ శాఖకు అప్పచెపితే అక్కడ కూడా జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయం తరహాలో అర్చకులు సిబ్బందిని ఏర్పాటు చేసి నిత్య పూజలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తామని బండి సంజయ్ ని కోరారు.అలంపురం ఆలయాల అభివృద్ధికి ఇటు స్థానికులు అటు రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు దాతలు అందరు కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ కేవలం పురాతత్వ శాఖ నిబంధనలు అడ్డు తగులుతున్న కారణంగా ఈ ఆలయాలు భక్త యాత్రికుల సౌకర్యాల లేమి కి గురవుతూ అభివృద్ధికి దూరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలోని కర్ణాటక ఇతర కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర పురాతత్వ శాఖ పరిధిలో ఉన్న కొన్ని ఆలయాలకు నిబంధనలో సడలింపు ఇచ్చిన విధంగా అలంపురం ఆలయాన్ని కూడా కేంద్ర పురాతత్వ శాఖ నిబంధనల నుండి కొన్ని సడలింపులు ఇచ్చి ఆలయ అభివృద్ధికి మరియు స్థానికంగా ఉన్న చిరు వ్యాపారుల జీవనాదారానికి సహకారం అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ ఉన్నారు.