Breaking News

సీరియల్ కిల్లర్ కేసుపై పోలీస్ ఉన్నతాధికారుల నజర్

. వనపర్తి జిల్లా రేవల్లి హత్య కేసు వివరాల పై ప్రత్యేకంగా ఆరా
. 2020 లోనే సీరియల్ కిల్లర్ కు సహకరించిన వనపర్తి జిల్లా పోలీసులు
. కాసుల కక్కుర్తితో సీరియల్ కిల్లర్ పై దృష్టిపెట్టని పోలీసులు
. ఇదే అదునుగా మరింత రెచ్చిపోయిన సీరియల్ కిల్లర్
. 2022 లో నాగర్ కర్నూల్ జిల్లాలో మరి కొందరి బలి

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ హత్యల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన సత్యనారాయణ మంత్రాలు, గుప్తనిధుల పేరుతో అమాయక ప్రజలను మోసం చేయడమే కాకుండా అతి కిరాతకంగా హత్యలు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. చివరకు ఓ హత్యకేసులో పోలీసులు తీగ లాగితే డొంక కదిలిందన్న చందంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో జరిగిన హత్యలు బయడపడ్డాయి. కాగా సీరియల్ కిల్లర్ సత్యనారాయణ కు నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన పలు హత్య కేసుల్లో మొక్కుబడిగా ఎంక్వైరీ చేసి నిందితుడికి సహకరించడంతో పాటు ఏకంగా నాగర్ కర్నూల్ సీఐ జక్కుల హనుమంతు పై పోలీస్ ఉన్నతాధికారులు సస్పెన్షన్ చేశారు. సుమారు నాలుగు నెలల తర్వాత సీఐ హనుమంతు పై ఇటీవల సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు గతంలో జరిగిన హత్యల వివరాలపై పోలీస్ ఉన్నతాధికారులు తాజాగా దృష్టి సారించారు.


రేవల్లి హత్య కేసులో వనపర్తి పోలీసుల సెటిల్ మెంట్..
సీరియల్ కిల్లర్ సత్యనారాయణ మొదట ఏపీ లో ని అనంతరం జిల్లాలో 2019 లోనే ఓ అమాయకుడిని హత్య చేసినా వెలుగులోకి రాలేదు. దీంతో సత్యనారాయణ తనను పోలీసులు సైతం గుర్తించే పరిస్థితిలో లేరని మంత్రాలు, గుప్త నిధుల పేరుతో అమాయకులను మోసం చేసేందుకు తెగబడ్డాడు. ఆ తర్వాత 2020 ఆగష్టు నెలలో వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో గుప్త నిధుల పేరిట ఆశచూపి ఒకే ఇంట్లో ముస్లీం కుటుంభానికి చెందిన నలుగురి ని ప్రసాదంలో విషం కలిపి నలుగురిని హత్య చేశాడు. ఈ కేసు విషయంలో వనపర్తి జిల్లా పోలీసులు చేసిన తప్పులు , కాసుల కోసం కక్కుర్తి పడి నిందితుడి సత్యనారాయణ ను చాలా తేలికగా ఈ కేసు నుంచి తప్పించినట్లు ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. వనపర్తి జిల్లా కు చెందిన సీసీఎస్ సీఐ శ్రీనివాసాచారీ నలుగురి హత్య కేసులో నిందితుడి ని విచారణ చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా అప్పటి డీఎస్పీ కిరణ్ కుమార్, వనపర్తి సీఐ సూర్య నాయక్ ఇతర పోలీసులు నిందితుడి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసుకొని కేసు ను తప్పుదోవ పట్టించినట్లు ఆ గ్రామస్తులు స్పష్టంగా ఆరోపిస్తున్నారు. వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు ను సైతం వీరంతా తప్పుదోవ పట్టించి మృతులు గుప్త నిధుల కోసం ఇంట్లో తవ్వకాలు జరిపినప్పుడు విష ప్రయోగం జరిగిందని అది ఎవరు చేశారో తెలియదని ఆ కేసును క్లోజ్ చేయించారు. దీంతో పోలీసులు తనను సులువుగా వదిలేయడంతో సీరియల్ కిల్లర్ సత్యనారాయణ మరింత రెచ్చి పోయి నాగర్ కర్నూల్ జిల్లాతో పాటు హైద్రాబాద్ తదితర ప్రాంతాలలో మరింత మంది ని పొట్ట బెట్టుకున్నాడు. డబ్బులతో అయాకులనే కాదు పోలీసులను సైతం తన వైపు కు తిప్పుకోవచ్చన్న ధైర్యం సత్యనారాయణ రావడంతో దర్జాగా గుప్త నిధులు, మంత్రాల పేరుతో అమాయకులను మోసం చేయడం ఆ మోసాన్ని గుర్తుపట్టే సమయంలో వారికి ప్రసాదంలో విషం కలిపి హత్య లు చేసుకుంటూ వెళ్లడం పై పోలీసు ఉన్నతాధికారులు విస్తుపోతున్నారు.
వనపర్తి జిల్లా పోలీసులకు బిగిస్తున్న ఉచ్చు…

2020 ఆగష్టు 14న వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో ఒకే కుటుంభానికి చెందిన నలుగురిని గుప్తనిధుల పేరుతో సీరియల్ కిల్లర్ సత్యనారాయణ హత్యలు చేసినట్లు వనపర్తి జిల్లా పోలీసులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా అప్పటి ఎస్ఐ, సీఐ, డీఎస్పీ, ఇతర పోలీస్ సిబ్బంది నిందితుడితో భారీగా డబ్బులు వసూలు చేసి కేసు ను తప్పుదోవ పట్టించినట్లు పోలీస్ ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ మేరకు రెండు రోజుల క్రితమే వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయానికి పోలీస్ ఉన్నతాధికారుల నుంచి రేవల్లి మండలం నాగపూర్ హత్య కేసు వివరాలు, విచారణ రిపోర్ట్, ఇతర వివరాలను కోరుతూ లేఖ పంపినట్లు తెలిసింది. 2020 లో నే వనపర్తి పోలీసులు సీరియల్ కిల్లర్ ను పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేసి జైలుకు పంపి ఉంటే ఆ తర్వాత నాగర్ కర్నూల్, హైద్రాబాద్ తదితర ప్రాంతాలలో జరిగిన హత్యలకు బ్రేక్ పడిఉండేదని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఈ కేసులో వనపర్తి జిల్లాలో అప్పడు నిందితునికి సహకరించి, అంటకాగిన పోలీసులకు ఉచ్చు భిగిస్తుందని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *