Breaking News

నల్లగొండ గోసవడ్డది

నల్లగొండ గోసవడ్డది


  • ఫ్లోరైడ్​ బాధితులను ఎవరూ పట్టించుకోలేదు
  • ఇంటింటికీ నీళ్లిచ్చి వారి బాధలు తీర్చినం
  • గోదావరి నీటితో జిల్లారైతుల కాళ్లు కడుగుతం
  • బీజేపీ వారు సంస్కారం నేర్చుకోవాలి
  • సహనానికి కూడా హద్దు ఉంటది.. టైం వస్తే తొక్కిపడేస్తం
  • ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగ ధన్యవాదసభలో సీఎం కేసీఆర్

సారథి న్యూస్, నల్లగొండ: అనాదిగా నల్లగొండ జిల్లా నష్టాలు, కష్టాలకు గురైందని, ఎవరూ పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యపాలకులు చిన్నచూపు చూశారని ధ్వజమెత్తారు. నాగార్జునసాగర్ ​డ్యాం ఏలేశ్వరం దగ్గర కట్టాలి.. కానీ కుట్రలు చేసి వంచన చేశారని విమర్శించారు. ఇప్పటికే చివరి ఆయకట్టుకు నీరందడం లేదని, పాలేరు కాల్వ కూడా కుట్రతో కట్టారన్నారు. ఫ్లోరైడ్ బాధితులను ఏ ఒక్కరూ పట్టించుకోలేదని.. ఇవ్వాళ స్వచ్ఛమైన నీళ్లు ఇంటింటికి ఇచ్చి మహమ్మారిని తరిమికొట్టామని చెప్పారు. ‘చంద్రబాబు హయాంలో కృష్ణాడెల్టాకు నీళ్లు ఇస్తూ నల్లగొండను ఎండబెట్టిండ్రు. పోరాటం చేసిన స్వయంగా నేనే వచ్చి అల్టిమేటం జారీచేసి ఆయన మెడలు వంచిన. ఈ రోజు తెలంగాణలో 24 గంటలు ఉచితంగా కరెంట్​ఇస్తున్నం. ఇవన్ని మంచి పనులు చూసి ప్రతిపక్షాల కళ్లు మండుతున్నయ్.’ అని అన్నారు. బుధవారం హాలియా పట్టణంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగ ధన్యవాదసభలో సీఎం కె.చంద్రశేఖర్​రావు ప్రసంగించారు.
సీఎం కేసీఆర్ ​ప్రసంగం ఆయన మాటల్లోనే..
తెలంగాణ ఏర్పడితే అన్ని సమస్యలను పరిష్కరిస్తానని 2003లో హాలియా సభలో చెప్పిన.. ఈనాడు మాట నిలబెట్టుకున్న. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 12 లిఫ్టులకు రూ.2500 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఏడాదిన్నరలోపు లిఫ్టులను పూర్తిచేస్తాం. మిర్యాలగూడ నియోజకవర్గంలో విర్లపాలెం, తోపుచర్ల అనే మరో రెండు లిఫ్టులు కూడా మంజూరు చేస్తున్న. లిఫ్టులను పూర్తిచేయకపోతే , వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం. ప్రజాప్రతినిధులు, అధికారులు అహర్నిశలు కృషిచేసి లిఫ్టులను సకాలంలో పూర్తిచేస్తాం. సాగర్ ఆయకట్టులో నీటిలభ్యత సరిగ్గా లేనప్పుడు రైతులు ఇబ్బందిపడకుండా శాశ్వత పరిష్కారం దిశగా సీతారామ ప్రాజెక్టు నుంచి పాలేరు మీదుగా పెద్దదేవులపల్లి రిజర్వాయర్ వరకు గోదావరి నీళ్లకు లింక్​చేస్తం. గోదావరి నీటితో నల్లగొండ జిల్లారైతుల కాళ్లు కడుగుతాం. పోడుభూముల సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తాం. నేనే జిల్లాల పర్యటనలు చేస్తూ పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తాం. నల్లగొండ జిల్లాలోని డిండి, ఎస్​ఎల్ బీసీ ఉదయసముద్రం ప్రాజెక్టులను కూడా పూర్తిచేస్తం. ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయిస్తాం. త్వరలోనే కొత్తగా అప్లై చేసుకున్న వారికి పింఛన్లు మంజూరుచేస్తాం. కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తాం.

ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగ ధన్యవాదసభలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్

నల్లగొండ మున్సిపాలిటీకి రూ.10కోట్లు
నల్లగొండ జిల్లాలోని 844 గ్రామపంచాయతీలకు అభివృద్ధి కోసం ఒక్కో గ్రామానికి రూ.20లక్షల మంజూరుచేస్తున్న.. ఒక్కో మండలానికి రూ.30లక్షలు మంజూరు.. నల్లగొండ మున్సిపాలిటీకి రూ.10కోట్లు మంజూరుచేస్తున్నాం. మిర్యాలగూడ మున్సిపాలిటీకి రూ.5కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన ఒక్కో మున్సిపాలిటీకి రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు వెంటనే జీవో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
నోముల మరణం బాధాకరం
నాకు మిత్రుడు నరసింహాయ్య అకాల మరణం బాధాకరం. కాంగ్రెస్, బీజేపీ నాయకులు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. మేము తలుచుకుంటే దుమ్మురేపుతాం. బీజేపీ వారు మంచి సంస్కారం నేర్చుకోవాలి. లేకుంటే ప్రజలే బుద్ధిచెబుతారు. మేము చేతులు ముడుచుకుని కూర్చోలేదు.. సహనానికి కూడా హద్దు ఉంటది. మాకు కూడా తెలుసు. తొక్కిపడేస్తాం.
విజయ డెయిరీని లాభాల బాట పట్టించినం..
రైతుబీమా ద్వారా కాలం చేసిన రైతులకు ఆర్థిక సాయం అందజేస్తున్నాం. కాంగ్రెస్ వాళ్లు విజయ డెయిరీని నిండా ముంచారు. ఇవ్వాళ విజయ డెయిరీని లాభాల బాట పట్టించినం. రాబోయే రోజుల్లో రైతులకు ఇంకా మంచి రోజులొస్తాయి. కోటి పదిలక్షల ఎకరాల వరిని పండిస్తూ తెలంగాణ ధాన్యగారం అయింది.. ఇవ్వాళ సూర్యపేట జిల్లా పచ్చగా మారింది.. బస్వపూర్ రిజర్వాయర్ పూర్తిచేస్తాం. యాదాద్రి జిల్లాను కూడా ససస్యశ్యాలం చేస్తాం.
లంచాల పీడ విరగడైంది..
గులాబీ జెండా వచ్చినంకనే ధరణి సిస్టం తెచ్చింది.. ఎమ్మార్వో కార్యాలయాల్లో లంచాలు తీసుకునే పీడ విరగడైంది. కాంగ్రెస్ వాళ్లది దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం. తెలంగాణను భూసమస్యలు లేని రాష్ట్రంగా తీర్చుదిద్దుతున్నాం.. 30లక్షల మంది యాదవులు ఉన్న తెలంగాణలో గొర్రెల పంపిణీ చేపట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపినం.. రైతులు ఐకమత్యం కావాలి. 2,600 రైతు వేదికలు నిర్మించినం.. కర్షకుల ఆత్మగౌరవాన్ని పెంచినం.. రైతు వేదికల్లో రైతులు చర్చించుకోవాలి.. మాట్లాడుకోవాలి. 12,765 గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమంతో అద్భుతమైన అభివృద్ధి జరిగింది. అన్ని గ్రామాలకు ట్రాక్టర్లను ఇచ్చినం.. మండల పరిషత్ లకు కూడా నిధులు మంజూరు చేస్తాం.
గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చినం
నర్సరీలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలు వర్ధిల్లుతున్నాయ్. తండాలను పంచాయతీలుగా చేసినం. గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చినం. పాలనపగ్గాలు గిరిజనులకే అప్పజెప్పినం. ఇవన్ని చర్చకు రావాలి.. మంత్రి జగదీశ్​రెడ్డి పట్టుబడితే దామరచర్ల లో ధర్మల్ పవర్ ప్లాంట్ ను నెలకొల్పుతున్నాం. రాష్ట్రానీకే వెలుగులు ఇచ్చే జిల్లాగా నల్లగొండ నిలుస్తోంది. సాగర్ ఉపఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడాలి. యాదాద్రి క్షేత్రాన్ని ప్రపంచం నివ్వెరపోయేలా పునర్నిర్మాణం చేస్తున్నాం. బడ్జెట్ లో వెయ్యికోట్లు కేటాయించి దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతాం. రాజకీయ గుంటనక్కల మాయమాటలు నమ్మొద్దని కోరుతున్నా..
ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టినం
అనంతరం మంత్రి జగదీశ్​ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఆకలి చావులు, కరువుతో విలవిలలాడిన నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేశారు సీఎం కేసీఆర్. రైతుల సంతోషాన్ని తెలిపేలా ధన్యవాదసభ నిర్వహిస్తే స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి రైతుల ఆనందాన్ని రెట్టింపు చేశారు. కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేసి నాటి పాలకుల వివక్షను చాటి చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇంచుఇంచు కలియ తిరిగిన సీఎం ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారు. ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టిన ఘనత టీఆర్​ఎస్​ ప్రభుత్వానిది. సీఎం కేసీఆర్ పాలనదక్షతతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గోదావరి, కృష్ణ జలాలతో రైతులు రికార్డ్ స్థాయిలో దిగుబడులు పండించారు. ముఖ్యమంత్రి ప్రత్యేకప్రేమతో ఉమ్మడి నల్లగొండ జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నది. ఇవ్వాళ జిల్లాలో వ్యవసాయ ముఖచిత్రమే మారిపోయింది. ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తున్నాం. రైతుల తరఫున సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపేందుకు సభ నిర్వహించినం.’ అని అన్నారు.
తెలంగాణకు కేసీఆర్​ శ్రీరామరక్ష
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కృష్ణా పరీవాహక ప్రాంతంలో 2003లో కేసీఆర్ స్వయంగా పాదయాత్ర చేసి సమైక్య పాలకుల వివక్షను ఎండగట్టారు. చివరి ఆయకట్టు రైతుల బాధలను తెలుసుకున్నారు. తెలంగాణకు శ్రీరామరక్ష ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నిక ఏదైనా గెలిపు టీఆర్​ఎస్​దే.. ప్రతిపక్షాలు స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు. ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడినా తెలంగాణ యావత్తు సీఎం కేసీఆర్ వెంట నడుస్తుంది.’ అని అన్నారు.