Breaking News

పేదల బతుకులు మార్చుదాం

ప్రమాదంలో బహుజన సమాజం

  • బాంఛెన్ ​బతుకులు పోవాలి
  • పీకే లాంటి వారి ఎత్తులను చిత్తుచేయాలి
  • తెలంగాణలో నిరంకుశపాలనను గద్దెదించాలి
  • 1300 మంది అమరవీరుల కలలను సాకారం చేద్దాం
  • మహిళలకు అన్నిరంగాల్లో సమాన అవకాశాలు
  • బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్
  • బహుజన విద్యావంతుల మేదోమధన సదస్సు విజయవంతం

సామాజికసారథి, హైదరాబాద్ ప్రతినిధి: ఇప్పుడు కావాల్సింది ప్రజాస్వామిక తెలంగాణ అని, 1,300 మంది అమరులు కలలుగన్న తెలంగాణను బహుజనీకరణ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్ ​ఆకాంక్షించారు. బహుజన రాజ్యం ఒకపార్టీ సమస్య కాదని, ఇది తెలంగాణలో ఉన్న అన్ని సామాజికవర్గాల సమస్య అని వివరించారు. ఆదివారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన బహుజన విద్యావంతుల మేదోమధన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ​ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్ ​మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు ఇంకా గుడారాల్లో బతుకుతున్నారని అన్నారు. తినడానికి తిండి, ఉండటానికి గూడు లేని పేదలను తన బహుజన రాజ్యాధికార యాత్రలో స్వయంగా చూశానని ఆవేదన వ్యక్తంచేశారు. మార్చి 6 నుంచి రాష్ట్రం మొత్తం తిరుగుతున్నానని, తెలంగాణలో ఎవరూ మంచి విద్యావైద్యం దొరకడం లేదని ఈ ప్రభుత్వాన్ని అడగడం లేదన్నారు. కేవలం తమకు ఇల్లు, భూమి ఇవ్వండి అని మాత్రమే అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కోటి మంది మహిళలకు చదువురాదని, తాను వెళ్తే బాంఛెన్​అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనం బాధల్లో ఉంటే ట్విట్టర్​ పిట్ట కేటీఆర్ కు సినిమాలు కావాలట? ఇదేనా మనకు కావాల్సింది? అని ప్రశ్నించారు.

అపరమేధావి కాళేశ్వరంలో ముంచారు
కేసీఆర్ ప్రజాధనాన్ని, కబ్జాలు చేయడంలో లీనమై ఉన్నారని విమర్శించారు. డిగ్నిటీ పేరిట రూ.13వేల నుంచి రూ.14వేల కోట్లు ఎక్కడపోయానని ప్రశ్నించారు. లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కరు కూడా బహుజన కాంట్రాక్టర్​లేరని, అందరూ కూడా అగ్రవర్ణాల కాంట్రాక్టర్లే ఉన్నారని చెప్పారు. రూ.1,536 కోట్లను ‘మనఊరు.. మనబడి’ పథకం కింద మేఘా కంపెనీకి కాంట్రాక్టులు కట్టబెట్టారని వెల్లడించారు. అపరజ్ఞాని, మేధావిగా అనుకునే సీఎం కేసీఆర్​ కాళేశ్వరం ప్రాజెక్టుతో నిండా ముంచారని చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో నిరంకుశపాలన
రాష్ట్రంలో అందరి ఫోన్లు ట్యాప్​అవుతున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నిరంకుశపాలన సాగుతోందని అన్నారు. తాను ఓ బర్త్​డే పార్టీకి వెళ్లితే అక్కడికి వచ్చిన వారికి మెమోలు ఇచ్చి వివరణ అడిగారని అన్నారు. వీఆర్ఏలు హక్కులను అడిగితే పోలీసులతో కొట్టించారని అన్నారు. ఆదివాసీల నుంచి భూమి లాక్కొని వారిపై దాడి చేయించారని అన్నారు. అంత ధైర్యం చేతిలో వారికి అధికారం ఉందనే కదా! అని అన్నారు. ముఖ్యమంత్రి ఆఫీసుకు రాకుండా నెల జీతం తీసుకోవడం లేదా? అని ప్రశ్నించారు. రెడ్లు మాత్రమే రాజ్యాధికారంలో ఉండాలన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటలకు మనస్తాపం చెందిన ఓ నాయకుడు కాంగ్రెస్​కు రాజీనామా చేసి బీఎస్పీలో చేరారని చెప్పారు. ముస్లింలు.. మైనార్టీలు అనుకుంటే వాళ్లను వాళ్లు మోసం చేసుకుంటున్నట్టేనని అన్నారు. కుట్రలతో బీసీలను వెనకకు నెట్టివేశారని చెప్పుకొచ్చారు.

సదస్సుకు హాజరైన మేధావులు, విద్యావంతులు

ఆ బాధ్యత విద్యావంతులపైనే

తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేయాల్సిన బాధ్యత బహుజన విద్యావంతుల వేదికపైనే ఉందని చెప్పారు. 75 ఏళ్ల తర్వాత మనం బహుజన రాజ్యం కావాలని తీర్మానం చేసుకుంటున్నామని, పాలకవర్గాలు ఉరుకుంటాయా? అని ప్రశ్నించారు. అందుకే పీకే లాంటి ఎన్నికల ట్రాటజిస్ట్​ను తెచ్చుకుంటున్నారని చెప్పుకొచ్చారు. రాత్రికిరాత్రే రాజకీయాలను మార్చి, కులాల వారీగా విడకొట్టి మన అవసరాలను వాళ్లకు అనుగుణం చేసుకోవడమే పీకే పని అని చెప్పుకొచ్చారు. ప్రతి రంగంలో పనిచేసే విద్యావంతుడు ఆయా వర్గాల ప్రజలకు ఈ పాలకుల మోసాలు, బహుజన రాజ్యం వస్తే ఎలా ఉంటుందో చెప్పాలని సూచించారు. భూమి, నీళ్లు, నిధులు, ప్రగతిభవన్ కూడా కావాలన్నారు. మార్టిన్​ లూథర్​కింగ్, మార్క్​జకర్​బర్గ్​ మాదిరిగానే కలలు కంటేనే బహుజన తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. మన రాజ్యం వచ్చాక ప్రగతిభవన్ ఆడిటోరియంలో మేదోమధనం ప్రతి నిత్యం చేయాలని చెప్పారు. మహిళలకు అన్నిరంగాల్లో సమాన అవకాశాలు, సమాన వాటా కేవలం బహుజన రాజ్యంతోనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్​ ఐఏఎస్​ అకునూరి మురళి, రిటైర్డ్​ తహసీల్దార్​ బాలరాజు, డాక్టర్​ అలీంఖాన్​ఫలాకీ, డాక్టర్​ ఎస్​.తిరుపతి, ప్రొఫెసర్​ సూరేపల్లి సుజాత, సిలువేరు హరినాథ్​ ఆయా అంశాలపై సోదాహరంగా వివరించారు. బహుజన విద్యావంతుల వేదిక నేతలు డాక్టర్​ జిలుకరి శ్రీనివాస్​, డాక్టర్​ ఎంఏ మాలిక్, పసునూరి దయాకర్ తదితరులు సమన్వయం చేశారు.