Breaking News

కూచిపూడి ఐశ్వర్యం

కూచిపూడి ఐశ్వర్యం
  • చిన్న వయసులోనే పెద్ద ప్రదర్శనలు
  • కరోనా సమయంలోనూ నృత్యంలో ట్రైనింగ్
  • ఆసక్తి నుంచి అభిరుచి వైపు అడుగులు
  • ఎన్నో రివార్డులు, అవార్డులు ఆమెకే సొంతం

సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: కరోనా లాక్ డౌన్ సమయంలో కూచిపూడి నృత్యం నేర్చుకుని ఎన్నో అవార్డులు సాధించి అందిరిచేత శభాష్ అనుపించుకుంటోంది. రెండేళ్ల నుంచి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందుతోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం డివిజన్​లోని కొత్తపేటకు చెందిన వేదపల్లి దీపిక, సన్నీ దంపతుల కుమార్తె ఐశ్వర్య కూచిపూడిపై స్వతహాగా ప్రతిభను పెంచుకుంది. ఆమె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు కరోనా సమయంలో వారు నివాసముంటున్న ప్రాంతంలోనే క్లాసికల్ డ్యాన్స్ ఇనిస్టిట్యూట్ లో ఐశ్వర్యకు కూచిపూడిపై శిక్షణ ఇప్పించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, టీచర్ శ్రీలక్ష్మి ఇచ్చిన శిక్షణ ఐశ్వర్యను అనతికాలంలోనే అందరిచేత మన్ననలు, అభినందనలు, ప్రశంసలు పొంది శభాష్ అనిపించుకునే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్న ఐశ్వర్య ఉప్పల్​లోని శిల్పారామం, కొత్తపేటలోని వెంకటేశ్వర ఆలయంలో కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చింది. భక్తులు, స్థానికులతో అభినందనలు పొందుతోంది. ఈ ఏడాది జూలైలో కళాకార్ బుక్ ఆఫ్​వరల్డ్ రికార్డ్ సంస్థ నిర్వహించిన కూచిపూడి ప్రదర్శనల్లో పాల్గొన్నది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు, ప్రముఖుల మన్ననలు పొంది ప్రశంస పత్రాన్ని స్వీకరించింది.

అభిరుచికి అనుగుణంగానే శిక్షణ

కూచిపూడిపై తమ కూమార్తె ఐశ్వర్యకు ఉన్న ఆసక్తిని గమనించాం. సమయం వృథా చేయకుండా కూచిపూడి శక్షణ  కేంద్రానికి పంపించాం. పిల్లల అభిరుచిని ప్రోత్సహించడం ద్వారా వారు ఆ రంగంలో రాణిస్తారని ఐశ్వర్య ద్వారా తెలిసింది. పిల్లలకు విద్య, క్రీడలు, ఇతర ఏ రంగమైనా వారి ఆసక్తి మేరకు శిక్షణ ఇప్పిస్తే వారు రాణిస్తారు.

దీపికా, సన్నీ, ఐశ్వర్య తల్లిదండ్రులు

ఆనందంగా ఉంది

అనతికాలంలోనే ఐశ్వర్య కూచిపూడిలో రాణించి అనేక ప్రదర్శనలలో పాల్గొని అందరి చేత ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉంది. శిక్షణ సమయంలో కూచిపూడిపై ఎంతో ఆసక్తిని కనభరుస్తుంది. ఆమె ద్వారా తమకు మంచి పేరు రావడం ఆనందంగా ఉంది.

 శ్రీలక్ష్మి, శిక్షకురాలు

మంచి పేరు తెచ్చుకోవాలి

తక్కువ సమయంలోనే కూచిపూడి నేర్చుకొని అందరి అభినందనలు పొందడం మాకు ఆనందంగా ఉంది. మేము సూచించిన విధంగా శిక్షణలో ఐశ్వర్య రాణిస్తోంది. ఆమె ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి మరింత పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

నిర్మలాదేవి, కూచిపూడి టీచర్