Breaking News

పండుగలా పల్లెప్రగతి

పండుగలా పల్లెప్రగతి
  • ఫొటోలకు ఫోజులు వద్దు.. పనులు చేయండి
  • ప్రజలను భాగస్వాములు చేయండి
  • జడ్పీ చైర్​పర్సన్ సరిత తిరుపతయ్య

సారథి, మానవపాడు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 4వ విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్​పర్సన్​ సరితా తిరుపతయ్య కోరారు. బుధవారం మానవపాడు ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎంపీపీ కోట్ల అశోక్ రెడ్డి అధ్యక్షతన ఆయా గ్రామాల సర్పంచ్​లు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్​పర్సన్, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష హాజరయ్యారు. పల్లెప్రగతిలో ప్రజలను భాగస్వాములు చేయాలన్నారు. అవసరమైన చోట మొక్కలు నాటాలన్నారు. మొక్కలను పెంచి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్న వారి ఇళ్లను గుర్తించి క్యాష్ ప్రైజ్ పెట్టాలని, అలాంటి సమయంలో వారికి కూడా మక్కువ ఉంటుందన్నారు. ఫొటోలకు ఫోజులు వద్దన్నారు. రోడ్ల పనులను పకడ్బందీగా చేయాలన్నారు. నేషనల్​హైవే 44పై మొక్కలు పెంచేలా సర్పంచ్​లు చొరవ తీసుకోవాలని ఆమె కోరారు.
నిర్లక్ష్యం చేస్తే కేసులు పెట్టండి
అంతకుముందు అడిషనల్​కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ.. జులై 1 నుంచి 4వ పల్లెప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా పదిరోజులపాటు నిర్వహించాలన్నారు. హరితహారం కార్యక్రమం, శానిటైజేషన్, పాడుబడిన బావులను పూడ్చడం, బోరుబావులను మూసివేయడం వంటి పనులు చేయాలన్నారు. రోడ్డు వెంట పంటపొలాల మీదుగా మొక్కలను నాటాలని, గ్రామాల్లో సర్పంచ్​లు చెప్పిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే పంచాయతీ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేయాలని చూచించారు. ప్రతిఇంటికి ఆరు మొక్కలు నాటించాలని, రైతులు, ఇంటి యజమానులతో ప్రేమతో మాట్లాడి మొక్కలను పెంచేలా బాధ్యత తీసుకోవాలన్నారు. జులై 1 నుంచి మూడు రోజులు పండగ వాతావరణం కనిపించాలన్నారు. పల్లెప్రగతి రిపోర్టు తప్పనిసరి గ్రామసభలో ప్రజలకు చూయించాలన్నారు. తూ..తూ మంత్రంగా అభివృద్ధి పనులు చేస్తే ఊరుకోబోమని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్​లకు హెచ్చరించారు. కార్యక్రమంలో మానవపాడు ఎంపీపీ కోట్ల అశోక్ రెడ్డి, ఇటిక్యాల ఎంపీపీ స్నేహశ్రీధర్ రెడ్డి, మండల ప్రత్యేకాధికారులు మహేష్, గోవింద నాయక్ పాల్గొన్నారు.