Breaking News

బసవేశ్వరుడు విశ్వగురువు

బసవేశ్వరుడు విశ్వగురువు

న్నెండో శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలో జన్మించిన బసవేశ్వరుడు విశ్వగురువుగా పేరొందారు. కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని  బాగేవారి వీరి జన్మస్థలం. బసవేశ్వరుడు 1134 లో వైశాఖ శుద్ధ తదియ రోజున(అక్షయ తృతీయ) అనగా సరిగ్గా 880 ఏళ్లం క్రితం జన్మించారు. తల్లి మాదాంబ, తండ్రి మాదిరాజు ద్వారా చిన్న వయసులోనే బసవేశ్వరుడు శైవపురాణ గాథలను అవగతం చేసుకున్నారు.

కుల, వర్ణ, లింగ వివక్షలు లేని సమసమాజ స్థాపనకు ఆనాడే అపారమైన కృషిచేసిన సంఘసంస్కర్త. సనాతన సంప్రదాయ ఆచరణలో నెలకొన్న చాదస్తాలు, మౌఢ్యాలను నిర్మూలించేందుకు నడుం కట్టి, సర్వ మానవ సమానత్వాన్ని ప్రబోధించిన విశ్వ గురువుగా, క్రాంతి యోగిగా చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప మానవతావాది. ధర్మ స్థాపనకు అవతరించిన నందీశ్వరుడి అంశగా శైవులు భావిస్తారు. ఆయన జీవిత గమనం మానవాళికి ఆదర్శం.

వైదిక కర్మాచారాలపై తిరుగుబాటు

ప్రథమ ఆంధ్ర వీర శైవకవిగా ప్రసిద్ధిచెందిన పాల్కురికి సోమనాథుడు (1160-1240) తనకు దాదాపు సమకాలికుడైన బసవేశ్వరుడి జీవిత కథను ద్విపద ఛందస్సులో ‘బసవపురాణం’ పేరుతో గొప్ప కావ్యం రచించారు. బసవేశ్వరుడికి శివభక్తి పసి వయసులోనే అబ్బింది. ఏడవ యేట, గర్భాష్టమ సంవత్సరంలో తండ్రి తనకు ఉపనయనం సంకల్పించగా బసవడు వద్దని తండ్రితో వాదించారు.

‘నిర్మల శివ భక్తి నిష్టితుడికి, కేవలం యజ్ఞాది వైదిక కర్మలతో కాలం పుచ్చే బ్రాహ్మణ్యంతో పనేమిటి? ఆ మార్గం నాకు అవసరం లేదు’ అని వైదిక కర్మాచారాలపై మొదటి తిరుగుబాటు చేశారు. ఇల్లు వదిలి వెళ్లిపోయారు. కృష్ణానది, మాలా ప్రభానది సంగమ క్షేత్రమైన కూడల సంగమేశ్వరంలో సంగమేశ్వరుడి సన్నిధికి చేరారు. 12 ఏళ్లు అక్కడ అధ్యయనం, అధ్యాత్మిక సాధనలు చేసి సంగమేశ్వరుడి కటాక్షానికి పాత్రుడై ఆయనను ప్రత్యక్షం చేసుకున్నారు.

తన బోధనల ద్వారా, ఆచరణలు, రచనల ద్వారా శివతత్వాన్ని విశేషవ్యాప్తిలోకి తెచ్చారు. కులం, జాతి, లింగం, వర్ణంతో నిమిత్తం లేకుండా శివభక్తికి అందరూ అధికారులే. శివభక్తులంతా సర్వసమానులే అని చాటి చెప్పేవారు. తాను బిజ్జలుడి ప్రధానిగా ఉన్న కాలంలో బసవేశ్వరుడు ‘అనుభవ మండపం’ అనే ఆధ్యాత్మిక వాద సభావేదికను ఏర్పరచి, తద్వారా వివిధ ఆధ్యాత్మిక సంప్రదాయాల వారు తమ తమ భిన్న అభిప్రాయాలను చర్చించుకునే అవకాశం కల్పించారు. ఈ చర్చా వేదికలే తర్వాత ఎన్నో శతాబ్దాలకు  ప్రజాస్వామిక వ్యవస్థలో  పార్లమెంట్​,శాసనసభలకు నమూనాగా నిలిచాయని చరిత్రకారులు చెబుతుంటారు.

హైందవ మత సంస్కర్త

బసవేశ్వరుడు హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖుల్లో ఒకరు. సమాజంలో కులవ్యవస్థ, వర్ణభేదాలు, లింగ వివక్షను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది. శైవ పురాణగాథలను అవగతం చేసుకున్న బసవుడికి కర్మకాండపై విశ్వాసం పోయింది. ప్రతిరోజు 1.96లక్షల మంది జంగాలకు మృష్ట స్నానాలతో అర్చించి అనంతరం తాను భుజించేవాడట. సాహిత్యపరంగా కూడా బసవేశ్వరుడి వచనాలకు చక్కని గౌరవం లభించింది. అతను మొత్తం 64 లక్షల వచనాలు కూర్చినట్లు ప్రతీతి. కానీ, ఈనాడు కొన్ని వేలు మాత్రమే మనకు లభ్యమయ్యాయి.

లింగైక్యం..

ఒకరోజు బ్రాహ్మణ యువతి, దళిత యువకుడికి తలపెట్టిన వివాహాన్ని బసవేశ్వరుడు ప్రోత్సహించడం ద్వారా బిజ్జలుడితో తీవ్రమైన విరోధం ఏర్పడింది. ఫలితంగా బసవేశ్వరుడు రాజధానిని వదిలిపెట్టి 1196లో తిరిగి కూడల సంగమేశ్వర క్షేత్రానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత బిజ్జలుడి హత్య జరిగింది. 1196 లోనే శ్రావణ శుద్ధ పంచమి నాడు బసవేశ్వరుడు లింగైక్యం చెందారని చెబుతుంటారు.

– దిండిగల్ ఆనంద్​శర్మ