Breaking News

ఆదివాసీ మహిళలపై దాడులు దుర్మార్గం

ఆదివాసీ మహిళలపై దాడులు దుర్మార్గం

  • హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలి
  • బాధిత మహిళలను పరామర్శించిన ఆర్​ఎస్పీ
  • పులుల పేరుతో మనుషులను హింసిస్తారా?
  • మేం అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలు
  • బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

సామాజికసారథి, మంచిర్యాల ప్రతినిధి: మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని కోయపోచగూడెం ఆదివాసీలపై ఇటీవల పోలీసులు, అటవీశాఖ అధికారులు చేసిన దాడిని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా తమ భూములకు పట్టాలు కావాలని అడిగితే పోలీసులు, అటవీశాఖ అధికారులను పెట్టి దుర్మార్గంగా హింసిస్తున్నారని మండిపడ్డారు. కనీసం మహిళలని కూడా చూడకుండా దాడి చేసి గాయపరిచడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మహిళల పుస్తెలు దొంగిలించి.. పసిపిల్లల తల్లులను జైలుకు పంపించిన అధికారులపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం, నిర్భయ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు న్యాయం చేయని పక్షంలో జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. బుధవారం ఆయన కుండపోత వర్షంలోనే మంచిర్యాల జిల్లా కోయపోచగూడెం ఆదివాసీ పల్లెకు వెళ్లి స్థానిక గిరిజనులు, ఆదివాసీల పోరాటానికి మద్దతు తెలిపారు.

వర్షంలోనే కోయపోచంగూడె పోడు భూముల బాధిత రైతులను పరామర్శిస్తున్న డాక్టర్ ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

కేసులు పెడుతున్నారే తప్ప పరిష్కారం చూపడం లేదు
70 ఏళ్లుగా ఇక్కడే బతుకుతున్నా, ఇంతవరకు ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆదివాసీ గిరిజనులపై వందలాది కేసులు పెడుతున్నారే తప్ప పరిష్కారం చూపడం లేదని పేర్కొన్నారు. పులుల సంరక్షణ పేరుతో మనుషులను హింసించడం ఏం న్యాయమని ప్రశ్నించారు. దొరలకు ఓట్లు వేయించుకోవడం ఒక్కటే తెలుసునని, ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాదని ఎద్దేవాచేశారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అసైన్డ్ భూములు, పోడు భూములు గుంజుకోవడం చాలా దారుణమని మండిపడ్డారు. సీఎం కేసీఆర్​పోడు భూములకు బదులు తన ఫాంహౌస్ కు రక్షణ పెంచుకుంటున్నారని, బంగారు తెలంగాణ పేరుతో దుర్మార్గమైన పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన విధంగానే, ఇక్కడ పేదలు తమ హక్కుల కోసం,బతుకు కోసం పోరాడుతుంటే, నాటి ఆంధ్ర పాలకుల మాదిరిగానే కేసీఆర్ ప్రభుత్వం పేదలపై వందలాది కేసులుపెట్టి భయపెడుతోందని మండిపడ్డారు. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఆదివాసీల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

పులులకు ఉన్న విలువ మనుషులకు లేదా?
పులులకు ఇస్తున్న విలువ మనుషులకు ఇవ్వడం లేదని, అందుకే ఈ దోపిడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రజలకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​పిలుపునిచ్చారు. ఆదివాసీలు కేసీఆర్​వలే ఫాంహౌస్​లు కట్టుకోడానికి వెంచర్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి భూమి అడగడం లేదన్నారు. కేవలం బతకడానికి కావాల్సిన తిండి కోసం భూమి హక్కు కావాలని అడుగుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోడీ పేదలకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్నారని, టీఆర్ఎస్, బీజేపీలు పేదల వ్యతిరేకపార్టీలని మండిపడ్డారు. పేదలు తమ హక్కుల కోసం పోరాటం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. దొరలు పేదలకు న్యాయం చేయరని, అందుకే పేదలే అధికారంలోకి వచ్చి మన హక్కులను కాపాడుకోవాలని సూచించారు. అందుకు దొరల నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దెదించాలని డాక్టర్​ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​పిలుపునిచ్చారు.

పోలీసులు చేతిలో గాయపడిన మహిళను పరామర్శిస్తున్న డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​, సీపీఐ జాతీయ నేత నారాయణ

ఈడ్చుకెళ్లి జీపులో కుక్కారు
‘‘మమ్మల్ని మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు ఈడ్చుకెళ్లి జీపుల్లో కుక్కారు. వారి నుంచి మేం తప్పించుకుని వచ్చాం. మేం వేసుకున్న గుడిసెలను చెదరగొట్టారు. మా చేతులు విరిచారు. మా పుస్తెలను లాక్కెళ్లారు. మా బిడ్డలను విసిరిపడేశారు. అన్నం వండుకున్న గిన్నెలను చెల్లాచెదురుగా పడేశారు” అంటూ అటవీశాఖ అధికారుల చేతిలో దెబ్బలు తిన్న బాధిత ఆదివాసీ మహిళలు డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎదుట కన్నీరు మున్నీరయ్యారు. గడీల పాలనను అంతం చేసి బహుజనులకు అధికారం అందించాలంటే, ఏనుగు గుర్తు ఉన్న బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించాలని ఆయన కోరారు. పోలీసులు, అటవీశాఖ అధికారులకు ఎదురు నిలిచి పోరాడిన మహిళలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆదివాసీ బిడ్డలను కౌన్సిలర్లు, కార్పొరేషన్​ చైర్మన్లు, ఎమ్మెల్యేలుగా చేస్తామని డాక్టర్ ​ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ భరోసా ఇచ్చారు. ఆయన వెంట పలువురు బీఎస్పీ నాయకులు, మహిళా నేతలు ఉన్నారు.