Breaking News

74 రోజులు ఒంటరి జీవితం గడిపా..


ముంబై: దేశంలో కరోనా కల్లోలం మొదలవుతున్న రోజుల్లో.. ఘనాకు చెందిన ఓ ఫుట్​ బాలర్​ స్వదేశానికి వెళ్లడానికి చాలా పెద్ద సాహసమే చేశాడు. రైల్లో త్రిస్సూర్ నుంచి ముంబైకి వెళ్లి విమానాశ్రయానికి చేరుకున్నాడు. కానీ అంతర్జాతీయ విమానాలు బంద్ అని తేలడంతో ముంబై విమానాశ్రయం టెర్మినల్ పక్కన 74 రోజుల పాటు ఒంటరి జీవితం గడిపాడు. చేతిలో ఉన్న రూ.వెయ్యితో కాలం వెళ్లదీశాడు. ఆ మధ్య కాలాన్ని ఎలా నెట్టుకొచ్చాడు?
పెట్టింది తిని..
ప్రతి ఏడాది కేరళలో జరిగే సెవెన్ ఏ సైడ్ ఫుట్​బాల్​ టోర్నీ కోసం ఘనాకు చెందిన 24 ఏళ్ల రాండీ యువాన్ ముల్లర్ మార్చిలో భారత్​కు వచ్చాడు. అయితే కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో స్వదేశానికి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నాడు. కానీ విమానాశ్రయానికి వెళ్లాకా ఫ్లైట్స్ బంద్ అని తేలడంతో దిగాలు పడిపోయాడు. ‘విమానాశ్రయంలో ఓ చో ట పడుకున్న నన్ను పోలీసులు వచ్చి లేపారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా చెప్పారు. కానీ నేను కేరళ తిరిగి వెళ్లలేను. అలాగని హోటల్​కు వెళ్లలేను. ఎందుకంటే డబ్బులు లేవు. ఏం చేయాలో తెలియలేదు. నాకు చావు తప్పదని భావించా. బయటకు వచ్చి అటుఇటు చూసి ఓ టెర్మినల్ దగ్గర చిన్న ప్లేస్లో ఉండిపోయా.

పోలీసులు ఆ ప్లేస్ ను అంత సులువుగా కనిపెట్టలేరు. కొన్ని రోజుల తర్వాత పోలీసులు కనిపెట్టినా నా పరిస్థితిని చూసి సాయం చేశారు. అలా అక్కడే రెండున్నర నెలలు ఉన్నా. పోలీసులు ఇచ్చే ఫుడ్ తినడం, వాళ్ల మొబైల్స్​లో హిందీ సినిమాలు చూస్తూ గడిపా. మా ఊరి విషయాలను వాళ్లకు చెప్పా’ అని ముల్లర్ పేర్కొన్నాడు. నిసర్గ తుఫాన్ వచ్చినప్పుడు పోలీసులు తమ క్యాబిన్​ను ఇచ్చి ఆదుకున్నారన్నాడు. అయితే రెండురోజుల క్రితం మహారాష్ట్ర మినిస్టర్ ఆదిత్యథాక్రేకు ఈ విషయం తెలిసి ఆదుకున్నాడన్నాడు. హోటల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు ఎంబసీతో మాట్లాడించడన్నాడు. ఘనాకు వెళ్లే మొదటి ఫ్లైట్​లో పంపిస్తామని హామీ ఇచ్చారు.
చనిపోయాడనుకున్నారు..
తన ఫోన్ చెడిపోవడంతో 20 రోజుల పాటు ఇంట్లో వాళ్లతో మాట్లాడలేదని ముల్లర్ చెప్పాడు. ‘పోలీసులే నాకు ఓ ఫోన్ ఇచ్చారు. నేను మొదటి కాల్ చేసినప్పుడు నేను చనిపోయానని అనుకున్నారట. కానీ ఇక్కడ సురక్షితంగానే ఉన్నా. నా కోసం రోటీ, బిస్కట్, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకొచ్చేవారు. వాళ్లు పెట్టింది తిని కాలం గడిపా. బట్టలు ఉతుక్కునే అవకాశం లేకపోవడంతో నాలుగు వారాలు ఒకే డ్రెస్​తో ఉన్నా.. వారం తర్వాత ఎండలో ఆరబెట్టి, కొద్దిగా ఫెర్​ ఫ్యూమ్​ కొట్టి మళ్లీ వేసుకునేవాడిని’ అని ముల్లర్ వివరించాడు.