Breaking News

190 వద్దే సచిన్ ఎల్​బీ

190 వద్దే సచిన్ ఎల్​బీ

సఫారీ బౌలర్ డేల్ స్టెయిన్ సంచలన ఆరోపణలు

లండన్: వన్డే ఫార్మాట్​ లో తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు సచిన్. ద్వైపాక్షిక సిరీస్​లో భాగంగా 2010 గ్వాలియర్​ లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో మాస్టర్ ఈ అరుదైన ఘనతను సాధించాడు. అయితే తాను 190 పరుగుల వద్ద సచిన్​ ను ఎల్బీ చేసినా అంపైర్ ఔట్​ ఇవ్వలేదని సఫారీ బౌలర్ డేల్ స్టెయిన్ సంచలన ఆరోపణలు చేశాడు. అప్పుడు ఔటిస్తే ద్విశతకం కాకపోయేదని అక్కసు వెళ్లబోసుకున్నాడు. ‘వన్డేల్లో సచిన్​ దే తొలి ద్విశతకం. అది మాపైనే చేశాడు. ఆ మ్యాచ్​ లో నేను మాస్టర్​ ను ఎల్బీ చేశా. కానీ ఆన్​ ఫీల్డ్ అంపైర్ ఇయాన్ గౌల్డ్ నాటౌట్ ఇచ్చాడు. బంతి వికెట్లను తాకుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.నాటౌట్ ఎందుకు ఇచ్చావని అంపైర్​ను అడిగా. కానీ సరైన సమాధానం చెప్పలేదు. నాకు తెలిసి స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను చూసి భయపడినట్లు ఉన్నాడు. అతని ముఖంలో అది కనిపించింది. ఒకవేళ ఔటిస్తే ప్రేక్షకులు అతన్ని హోటల్​ కు వెళ్లకుండా అడ్డుపడతారని భావించాడనుకుంటా. అప్పుడు జరిగిన సంఘటనలన్నీ నాకు బాగా గుర్తున్నాయి’ అని స్టెయిన్ వ్యాఖ్యానించాడు.

వాస్తవానికి ఆ మ్యాచ్​ లో సచిన్ 190 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. స్టెయిన్ వేసిన ఓవర్​ లో కేవలం మూడు బంతులే ఆడాడు. అందులో ఎక్కడా ఎల్​ బీకి అవకాశం లభించలేదు. ఓవరాల్‌గా ఆ మ్యాచ్‌లో సచిన్‌ వరల్డ్‌ రికార్డు డబుల్‌ సెంచరీ చేయడంతో ఇండియా 403/3 రన్స్‌ చేసింది. తర్వాత లక్ష్యఛేదనలో సఫారీ టీమ్ 42.5 ఓవర్లలో 248 రన్స్‌ కు ఆలౌటైంది. ఫలితంగా టీమిండియా 153 రన్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే ఫార్మాట్‌లో సచిన్‌ ఆ ఘనత సాధించిన తర్వాత.. రోహిత్‌, సెహ్వాగ్‌, గేల్‌, గప్టిల్‌ కూడా డబుల్‌ సెంచరీలు సాధించారు.