సారథి న్యూస్, మెదక్: సాధారణంగా ఎక్కడైన దొంగలు దొంగతనం చేస్తారు. కానీ విచిత్రంగా
ఓనర్ లే వైన్స్ కు కన్నం వేసి రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
గజ్వేల్ రూరల్ సీఐ కోటేశ్వరరావు కథనం ప్రకారం.. కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం లాక్ డౌన్ సందర్భంగా గౌరారం లోని వైన్స్ కు ఎక్సైజ్ అధికారులు సీల్ వేశారు. కొన్ని రోజులుగా దొంగతనాలు జరుగుతుండడంతో సదరు వైన్స్ ఓనర్ రోజూ రాత్రి కాపలా ఉంటున్నారు. కాగా ఓనర్ లే పథకం ప్రకారం ముందు కాపలా కాస్తూనే వెనక కన్నం వేసి మద్యం కాటన్లను చోరీ చేసి అమ్ముకునేందుకు ప్లాన్ వేశారు. కాగా, మద్యం షాపుల్లో తరచూ దొంగతనాలు జరుగుతుండడంతో కొన్ని రోజులుగా రాత్రిపూట గౌరారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఏఎస్సై మధుసూదన్ ఆధ్వర్యంలో పోలీస్ టీం వైన్స్ వద్దకు వచ్చింది.
ఆ సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా ముందు కొందరు కాపలా ఉన్నారు. అయితే అనుమానం వచ్చి పోలీసులు వెనకకు వెళ్లి చూడగా వైన్స్ లైసెన్స్ హోల్డర్ తో పాటు, ఆరుగురు పార్ట్ నర్ లు, మరో ఐదుగురు వ్యక్తులు కలిసి కన్నం వేసి 53 కాటన్ల మద్యం రెండు వెహికిల్ లలో ఎక్కించి తరలిస్తున్నారు. అక్కడ దొంగతనం జరుగుతున్నట్టు గుర్తించిన పోలీసులు చోరీకి పాల్పడుతున్న 8 మందిని పట్టుకోగా, ముగ్గురు పారిపోయారు. పోలీసులు రూ.4.5లక్షల విలువైన 53 కాటన్ల మద్యం, ఐదు వెహికిల్స్ ను స్వాధీనం చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు.