Breaking News

సినీకార్మికులను ఆదుకుంటాం

  • మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​
  • చిరు ఇంట్లో సినీ ప్రముఖుల భేటీ

హైదరాబాద్: కరోనా విపత్కర పరిస్థితులను సినీరంగ కార్మికులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ భరోసా ఇచ్చారు. షూటింగ్‌లకు అనుమతులపై పరిశీలిస్తున్నామని, సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గురువారం ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గురువారం ఉదయం సమావేశమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్‌బాబు, సి.కల్యాణ్, దిల్‌ రాజు, జెమిని కిరణ్‌, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, దర్శకుడు రాజమౌళి, వీవీ వినాయక్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఎన్‌.శంకర్‌, కొరటాల శివ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..

మంత్రి తలసానితో సమావేశమైన సినీ ప్రముఖులు

సినీపరిశ్రమ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. సినిమా, టీవీ షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ అంశాలపై సమావేశంలో చర్చించినట్టు వెల్లడించారు. ఈనెలాఖరు వరకు లాక్‌ డౌన్‌ ఉందని, అయినా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టంచేశారు. చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిటీ ద్వారా దాదాపు 14వేల మంది సినీ కార్మికులను ఆదుకున్నారని, ప్రభుత్వం కూడా కార్మికులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని మంత్రి తలసాని పేర్కొన్నారు.