భారత హాకీ జట్ల ప్లేయర్ల ఆరోగ్యంపై ఆందోళన
న్యూఢిల్లీ: బెంగళూరులోని సాయ్ సెంటర్ లో పనిచేస్తున్న కుక్ (వంట మనిషి)కి కరోనా వైరస్ ప్రబలింది. దీంతో ఇటీవల గుండెపోటుకు గురైన ప్రాణాలు కోల్పోయాడు. మరణాంతరం కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. దీంతో సాయ్ సెంటర్ లో ఉన్న భారత హాకీ జట్ల ప్లేయర్ల ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. అయితే చనిపోయిన కుక్.. ప్లేయర్లు ఉన్న ప్రాంతంలోకి ఒక్కసారి కూడా వెళ్లలేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికి హాకీ ప్లేయర్లను ఎక్కడకు తరలించడం లేదని హాకీ ఇండియా(హెచ్ఐ) సీఈవో ఎలెనా నార్మన్ స్పష్టంచేశారు.
వృద్ధులను మార్చి 10 నుంచి డ్యూటీకి రావద్దని చెప్పామని, చనిపోయిన వ్యక్తి వారిలో ఒకరిని తెలిపారు. సాయ్ క్యాంపస్‌ను మూడు భాగాలుగా వేరు చేశామని, హాకీ ప్లేయర్లంతా సెక్టార్–బీలో సేఫ్‌గా ఉన్నారన్నారు. మరోవైపు కరోనాకు వ్యాక్సిన్ వచ్చాకే పూర్తిస్థాయి టోర్నమెంట్‌లు షురూ చేస్తామని ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్(ఎఫ్‌ఐహెచ్) ప్రకటించింది. ఐదు దశల్లో తాము హాకీని పాతస్థితికి తీసుకురావాలని భావిస్తున్నామని చెప్పింది. అయితే ఇందుకు సంబంధించి గైడ్ లైన్స్ రూపొందించిన ఎఫ్‌ఐహెచ్ వాటికి ఎలాంటి కాలపరిమితి పెట్టలేదు.