న్యూఢిల్లీ: బ్యాటింగ్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆట కోసం క్లాస్‌లకు డుమ్మా కొట్టే వాళ్లమని సురేశ్ రైనా అన్నాడు. భారత మ్యాచ్‌ల కోసం వారంరోజుల నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకునే వాళ్లమన్నాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు కుటుంబసభ్యులతో తిట్లు తిన్నామని చెప్పాడు. ఈ సందర్భంగా 1998లో షార్జాలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ను చూసేందుకు తాము పడిన కష్టాలను గుర్తుచేసుకున్నాడు.
‘ఆ రోజు ఆసీస్‌తో మ్యాచ్‌తో గెలిస్తే ఫైనల్‌కు చేరుతాం. ఆ మ్యాచ్‌ను ఎలాగైనా చూడాలని నేను, నా స్నేహితుడు అమిత్ అనుకున్నాం. కానీ క్లాస్‌లు ఎక్కువగా ఉండడంతో ఎవరికి తెలియకుండా చివరి రెండు క్లాస్‌లకు డుమ్మా కొట్టాం. నేరుగా మా మరో స్నేహితుడు వాళ్ల ఇంటికి వెళ్లిపోయాం. మా ఇంట్లో టీవీ ఉన్నా.. దూరదర్శన మాత్రమే వచ్చేది. నేను మరో నలుగురైదుగురు స్నేహితులం మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అనుకున్నట్లుగానే క్రీజులోకి వచ్చిన సచిన్ దుమ్మురేపాడు. కానీ తర్వాతి రోజు స్కూల్‌లో టీచర్లు ఏమంటారోనని భయం. ఇంట్లో కూడా తెలుస్తుందేమోనని హడలిపోయాం. కానీ ఆ మ్యాచ్‌లో సచిన్ ఆటతో ఇవన్నీ మర్చిపోయాం’ అని రైనా పేర్కొన్నాడు. ఈ సంఘటన జరిగినప్పుడు 12 ఏళ్ల వయసున్న రైనా.. 13 ఏళ్ల తర్వాత సచిన్‌తో కలిసి మ్యాచ్ ఆడడం విశేషం.