జమైకా: తన సహచరుడు రామ్ నరేశ్ శర్వాణ్.. కరోనా వైరస్ కంటే భయంకరమైన వ్యక్తి అని విండీస్ డాషింగ్ బ్యాట్ మెన్ క్రిస్ గేల్ ఆరోపించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) జట్టు జమైకా తలవాస్ నుంచి తనను తొలగించడం వెనక శర్వాణ్ పెద్ద కుట్రచేశాడని ధ్వజమెత్తాడు.
గతేడాది గేల్ ను ఐకాన్ ప్లేయర్ గా తీసుకున్న జమైకా ఈసారి రిటైన్ చేసుకోలేదు. ఈసారి గేల్ సెయింట్ లూసియా జౌక్స్ టీముకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ‘తలావాస్ ఫ్రాంచైజీని శర్వాణ్ తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే నన్ను సాగనంపాడు. తలావాస్ ఓనర్ కు నువ్వు చాలా క్లోజ్.
కాబట్టే ఆ టీమ్‌లో జరిగే ప్రతి మార్పు వెనక నీ హస్తం ఉంది. నా బర్త్ డే పార్టీకి వచ్చి బాగా తాగి, మన స్నేహం గురించి గొప్పగా మాట్లాడావు. అప్పుడు పూర్తిగా నిన్ను నమ్మా. కానీ ఇప్పుడు ఇలా వెన్నుపోటు పొడుస్తావని ఊహించలేదు. నువ్వో విషనాగువి. ప్రతీకారేచ్ఛతో ఉన్న వ్యక్తివి. నీకు పరిణతి లేదు.
ఈ వెన్నుపొటు పొడవడం ఎప్పుడూ మానుకుంటావో. ఇక నీవు నన్ను కలవడం కలలో కూడా జరగదు’ అని గేల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.