న్యూఢిల్లీ: ఐపీఎల్లో విదేశీ స్టార్లు ఆడకపోతే కళ తప్పుతుందని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా అన్నాడు. ఈ లీగ్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉందని, అందుకే అందరూ పాల్గొనాలని సూచించాడు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్‌పై ఏదో ఓ నిర్ణయం తీసుకుంటే అది తొందరపాటే అవుతుంది. భారత్ తయారుచేసిన ఓ అంతర్జాతీయ ఈవెంట్ ఈ లీగ్. ప్రపంచ క్రికెట్‌కే ఇది తలమానికం. క్రికెట్లో ప్రీమియర్ ఈవెంట్ కూడా. అందుకే విదేశీ క్రికెటర్లు కచ్చితంగా ఉండాల్సిందే. లేకపోతే టోర్నీ కళ తప్పుతుంది’ అని వాడియా వ్యాఖ్యానించాడు.
ఒకవేళ లీగ్‌ను ముందుకు తీసుకెళ్లాలనుకుంటే.. ఏయే దేశాలు తమ క్రికెటర్ల ప్రయాణానికి అనుమతి ఇస్తాయో చూడాలన్నాడు. బీసీసీఐ ముందు అనేక సమీకరణాలు ఉన్నా.. కరోనాను దృష్టిలో పెట్టుకునే తుది నిర్ణయాలు ఉండాలన్నాడు. వైరస్ అదుపులోకైనా రావాలి.. లేదా వ్యాక్సిన్ అన్న అందుబాటులో ఉండాలి.. ఈ రెండు పరిస్థితులను బట్టే ఐపీఎల్‌పై పూర్తి స్పష్టత వస్తుందని వాడియా తెలిపాడు.