Breaking News

వాళ్లను విడిచిపెట్టొద్దు

వాళ్లను విడిచిపెట్టొద్దు

  • యోగికి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్రమోడీ

ల‌క్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ దళిత యువతి సామూహిక లైంగిక‌దాడి కేసులో దోషులుగా తేలినవారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అన్నారు. ఈ ఘటన గురించి ప్రధాని మోడీ తనతో మాట్లాడారనీ, దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారని యోగి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్లు చేశారు. యోగి స్పందిస్తూ.. ‘ఈ ఘటనకు కారకులు తప్పించుకోలేరు. దీనిపై ముగ్గురితో ప్రత్యేక టీంను ఏర్పాటు చేస్తున్నాం. ఈ టీం ఏడు రోజుల్లో విచారణ జరిపి నివేదికను అందజేస్తుంది. బాధితురాలికి సత్వర న్యాయం జరిగేందుకు ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తాం..’ అంటూ ట్వీట్ చేశారు.

సెప్టెంబర్ 14న హత్రాస్ కు చెందిన దళిత యువతిపై ఉన్నత వర్గానికి చెందిన నలుగురు దుండగులు అత్యాచారం చేసి ఆపై అత్యంత కిరాత‌కంగా ఆమె గొంతును కోశారు. ఈ ఘటనలో ఆ యువ‌తి తలకు, నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. రెండు వారాల పాటు ఆస్పత్రిలో జీవ‌న్మరణ పోరులో పోరాడిన ఆ యువ‌తి.. మంగళవారం ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే.