- ఐసీసీ క్రికెట్ కమిటీ
న్యూఢిల్లీ: బంతి మెరుపును పెంచేందుకు లాలాజలం (సెలైవా) వాడడాన్ని ఐసీసీ క్రికెట్ కమిటీ నిషేధించింది. కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశాలు ఉండడంతో టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నేతృత్వంలోని కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ‘మనం అసాధారణ పరిస్థితుల్లో బతుకుతున్నాం. క్రికెట్‌ను సురక్షితంగా మొదలుపెట్టేందుకు మా కమిటీ కొన్ని మధ్యంతర ప్రతిపాదనలు చేసింది. వీటిని ఐసీసీ ముందు ఉంచుతాం. బంతి మెరుపు కోసం ఇక నుంచి లాలాజలాన్ని వాడొద్దు. అయితే చెమటను ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు రావని అనుకుంటున్నాం’ అని కుంబ్లే పేర్కొన్నాడు.
అంతర్జాతీయ మ్యాచ్ లో ఇద్దరు లోకల్ అంపైర్లను తీసుకురావాలని ప్రతిపాదించింది. గతంలో ఈ రూల్ ఉన్నా.. తర్వాతి మ్యాచ్‌లో పారదర్శకత కోసం తర్వాతి దశలో తీసేశారు. టెస్ట్‌ల్లో ముగ్గురు ఐసీసీ అంపైర్లు, ఒక్క ఆతిథ్య అంపైర్ ఉండనున్నాడు. వన్డేలకు ఇద్దరు ఐసీసీ, ఇద్దరు ఆతిథ్య అంపైర్లు, టీ20ల్లో నలుగురు ఆతిథ్య అంపైర్లు ఉండేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రతిపాదనలకు ఐసీసీ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది.