- ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్
కోల్‌కతా: ఎంఫాన్ తుఫాన్ దాటికి దెబ్బతిన్న ప్రాంతాలను ఆదుకోవడానికి ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్ సీఎం సహాయ నిధికి డబ్బులు ఇవ్వడంతో పాటు కోల్‌కతా అంతటా ఐదు వేల మొక్కలను నాటేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని కేకేఆర్ ట్వీట్ చేసింది. ‘గత దశాబ్దకాలంలో ఇంత పెద్ద తుఫాన్‌ను చూడలేదు. చాలా నష్టం సంభవించింది. జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు మేం కూడా సాయం అందిస్తాం.
మా ఫ్రాంచైజీ తరఫున సీఎం రిలీఫ్ ఫండ్‌కు నిధులు అందజేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన చోట్ల మొక్కలు నాటుతాం. ఇలాంటి కష్టకాలంలో అందరూ సమష్టిగా పనిచేసి ప్రజల ముఖాలపై నవ్వులు పూయించాలి. బాగా దెబ్బతిన్న కోల్‌కతా, నార్త్ అండ్ సౌత్ 24 పరగణాస్, ఈస్ట్ మిడ్నాపూర్‌లో మా సేవలను మరింతగా కొనసాగిస్తాం. సర్వం కోల్పోయిన పేద ప్రజలకు రేషన్, ఎసెన్షియల్స్, హైజీన్ ఐటెమ్స్, గ్రాసరీని అందజేస్తాం’ అని కేకేఆర్ చెప్పుకొచ్చింది. ఇందుకు అవసరమైన ప్రణాళికలను అధికారులతో కలిసి చర్చిస్తున్నామని వెల్లడించింది.