సారథి న్యూస్, షాద్‌నగర్: ఆ చిన్నారులకు జన్మనిచ్చిన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. చిన్నారుల ఆలనాపాలనా తండ్రికి భారంగా మారింది.. ముక్కుపచ్చలారని ఆ పసిబిడ్డలను లాలించలేనని శిశువిహార్‌కు అప్పగించాడు. కన్నపేగు కలతచెంది బిడ్డలను వెతుక్కుంటూ వెళ్లింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన గణేశ్ 16ఏళ్ల క్రితం షాద్ నగర్ కు బతుకుదెరువు కోసం వలస వచ్చాడు. పట్టణంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్ నగర్ కు చెందిన శ్రీలతతో పరిచయం ఏర్పడి 9ఏళ్ల క్రితం పెళ్లిచేసుకున్నాడు. వారికి శ్రీగాయత్రి, హన్సిక ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే గణేష్ భార్య శ్రీలత గుండె జబ్బుతో మూడునెలల క్రితం చనిపోయింది. చిన్నారుల ఆలనాపాలనా చూసే తల్లి లేకపోవడంతో వారి బాధ్యత తండ్రికి భారంగా మారింది. దీంతో చేసేదిలేక ఐసీడీఎస్ అధికారుల ద్వారా శిశువిహార్‌కు అప్పగించాడు. అయితే గణేశ్ చిన్నారులను విడిచి ఒంటరిగా ఉండలేకపోయాడు. కన్నపేగుపై మమకారాన్ని చంపుకోలేక.. చిన్నారులను అప్పగించిన కొన్నిగంటల్లోనే మళ్లీ వారి వద్దకు వెళ్లాడు. ‘నా బిడ్డలను విడిచి నేను ఉండలేను.. వారిని నేనే సాకుతా’ అని తిరిగి తెచ్చుకున్నాడు.