Breaking News

బౌలర్లు.. తస్మాత్ జాగ్రత

బౌలర్లు.. తస్మాత్ జాగ్రత

ముంబై: అసలే సుదీర్ఘమైన విరామం… ఆపై విశ్రాంతి వల్ల వచ్చే ఉత్సాహం.. దీనికితోడు ఎప్పుడెప్పుడు బరిలోకి దిగుదామనే ఆతృత.. ఈ అంశాలే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెటర్ల కొంప ముంచుతాయని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. అందుకే ఆట మొదలయ్యాక బౌలర్లను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. లేకపోతే గాయాల బెడద తప్పదన్నాడు. ‘క్రికెటర్లు గాయపడకుండా టీమ్ మేనేజ్ మెంట్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరంభంలో శిక్షణ స్వల్పస్థాయిలో ఉండేలా ప్రణాళికలు వేయాలి.

రోజులు గడిచేకొద్ది తీవ్రత పెరగాలి. కానీ విరామం వల్ల వచ్చిన ఉత్సాహంతోనే ఆటగాళ్లు కాస్త ఎక్కువ ప్రాక్టీస్ కోరుకుంటారు. కానీ ఇక్కడే దెబ్బకొట్టే అవకాశాలున్నాయి. ముఖ్యంగా బౌలర్లు. పూర్తి స్థాయిలో రన్నింగ్ చేయడానికి నాలుగు వారాల సమయం పడుతుంది. అంతర్జాతీయ, దేశవాళీ.. ఏ జట్టులోనైనా నలుగురి నుంచి ఆరుగురు బౌలర్లు ఉంటారు. వీళ్లను ప్రణాళికల ప్రకారం వాడుకోవాలి. వర్క్ లోడ్ ను బట్టి బౌలర్లకు ట్రైనింగ్, మ్యాచ్ ఆడే అవకాశాలు ఇవ్వాలి. అప్పుడే బౌలర్లు పూర్తి స్థాయిలో ఫిట్ గా ఉంటారు’ అని ఇర్ఫాన్ సూచించాడు.