వెటరన్ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్
న్యూఢిల్లీ: ఒకప్పుడు అనామక బౌలర్. కానీ ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండవ ర్యాంకర్. డెత్ ఓవర్లో బౌలింగ్ అంటే ఠక్కున గుర్తొచ్చేది జస్ప్రీత్ బుమ్రా. అయితే ఐపీఎల్ తొలినాళ్లలో బుమ్రాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లోకి తీసుకోవాలని చెప్పినా విరాట్ కోహ్లీ పట్టించుకోలేదట. ఈ విషయాన్ని వెటరన్ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ వెల్లడించాడు. బుమ్రా గొప్ప బౌలర్ అవుతాడని ఊహించే.. తాను కోహ్లీకి చెప్పానన్నాడు. ‘విదర్భపై అరంగేట్రం చేసినప్పుడు బుమ్రా బౌలింగ్ చూశా. ఏదో కొత్తగా అనిపించింది. కచ్చితంగా గొప్ప బౌలర్‌గా ఎదుగుతాడని అనుకున్నా. వెంటనే జాన్ రైట్, రాహుల్ సింఘ్వీతో మాట్లాడా. 2013 వేలం సందర్భంగా బుమ్రాను తీసుకొమ్మని విరాట్ కు పదేపదే చెప్పా. కానీ ఎందుకో పెద్దగా పట్టించుకోలేదు. చివరకు కొద్దిగా ప్రయత్నాలు చేసినా అప్పటికే ముంబై ఇండియన్స్ తీసేసుకుంది. లేకపోతే బుమ్రా.. ఆర్సీబీకి ఆడితే పరిస్థితి మరోలా ఉండేది’ అని పార్థివ్ వ్యాఖ్యానించాడు. బుమ్రా రాకతో 2013లో తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత 2015, 2017, 2019లో విన్నర్‌గా నిలిచింది.