Breaking News

బాహుబలి.. వరల్డ్ వైడ్ హీరో

జూలై 10, 2015లో మొదలైన బాహుబలి హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, రానా విలన్​గా భారీ క్యాస్టింగ్​తో తెరకెక్కించిన బాహుబలి 1,2లు ప్రపంచ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించి తెలుగు ఇండస్ట్రీ సత్తా నిరూపించాయి. అయితే ఈ సినిమా గతనెల మే 31న రష్యాలో టివీ ఛానెల్​లో రిలీజ్ చేశారు. అక్కడ కూడా ‘బాహుబలి’కి మామూలు స్పందన రాలేదు. అంతగా ఎవరినీ మెచ్చని రష్యన్స్ కూడా బాహుబలిని ఆకాశానికి ఎత్తేశారు. ఒక్కసారిగా ప్రభాస్ ప్రపంచవ్యాప్త నటుడు అయిపోయాడు. ఆ విషయాన్ని నిరూపిస్తూ ప్రభాస్ తాజాగా రష్యాకు చెందిన ఒక ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నాడు. ఆ అవార్డు ఇండియన్ సినిమా పరిశ్రమకు చెందిన రాజ్ కపూర్ కు 30ఏళ్ల క్రితం వచ్చింది. మళ్లీ ఇప్పటి వరకూ ఏ ఇండియన్ స్టార్ కూడా ఆ అవార్డును పొందలేక పోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు బాహుబలి సినిమాతో రష్యా ప్రేక్షకులను అలరించిన ప్రభాస్ కు ఆ అవార్డు దక్కింది. ‘రష్యన్ ఆడియన్స్ హార్ట్’ అనే అవార్డుకు ప్రభాస్ ఎంపిక అయ్యాడు. బాహుబలి రెండు పార్ట్ లతో రష్యన్స్ హార్ట్ గెలుచుకున్న కారణంగా ఈ అవార్డును ప్రభాస్ అందుకోబోతున్నాడు.
30ఏళ్ల క్రితం రాజ్ కుమార్ శ్రీ 420.. అవారా… ఆరాధన వంటి చిత్రాలు రష్యాలో విడుదల అయ్యి మంచి విజయం సాధించాయి. అందుకే రాజ్ కుమార్ కు రష్యన్ ఆడియన్స్ హార్ట్ అవార్డు దక్కింది. రష్యన్స్ బాహుబలి సినిమాకు బ్రహ్మరథం పట్టడంతో ఈ అవార్డు ప్రభాస్ కు దక్కింది. ప్రభాస్ నటనకు రష్యన్స్ ఫిదా అయిపోయి అద్భుతమైన నటన అంటూ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఏకంగా రష్యన్ ఆడియన్స్ హార్ట్ అవార్డుతో ప్రభాస్ ను గౌరవించారు. ఈ అవార్డుతో ప్రభాస్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తమైంది. ప్రభాస్ త్వరలో చేయబోతున్న నాగ్ అశ్విన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీఎత్తున విడుదల అయ్యేందుకు ఈ అవార్డు హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు సినీ విశ్లేషకులు.