Breaking News

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

సారథి న్యూస్, మెదక్: రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలంలో 146 మందికి, మనోహరాబాద్ మండలంలో 54 మంది కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల సదుపాయాలు ఉన్నాయని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి గర్భిణి ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకోవాలన్నారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని, సర్కారు దవాఖానాల్లో ఫ్రీగా చేస్తారని చెప్పారు. ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ మండలాల పరిధిలో రోజుకు యాభై మందికి ఫోన్ చేసి వారి ఆరోగ్య పరిస్థితులపై తెలుసుకోవాలని, ఇది ఎంతో మంచిపద్ధతి అని మంత్రి సూచించారు.

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు వచ్చిన ప్రజలకు సేవలు అందించేందుకు వెనుకాడేది లేదని స్పష్టంచేశారు. ఉమ్మడి జిల్లాలో మంత్రి హరీశ్ రావు ఎప్పటికప్పుడు పర్యటిస్తూ.. ప్రజలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్​పర్సన్​హేమలత, మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఎఫ్​డీసీ చైర్మన్​ వంటేరు ప్రతాప్ రెడ్డి, బక్కి వెంకటయ్య, తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, తహసీల్దార్ శ్రీదేవి, మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.