Breaking News

ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారు

ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారు

  • దోపిడే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది
  • ఉత్సవ విగ్రహంలా వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల
  • సీఎల్పీ లీడర్​ మల్లు భట్టి విక్రమార్క ధ్వజం

సారథి న్యూస్, మెదక్: సీఎం కె.చంద్రశేఖర్​రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి దోపిడే ధ్యేయంగా పనిచేస్తోందని సీఎల్పీ లీడర్​మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం ఆయన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి మెదక్​ప్రభుత్వాసుపత్రిని సందర్శించి కరోనా రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విపత్తు సమయంలో సర్వ సైన్యాధ్యక్షుడిగా ముందుండి కరోనాపై యుద్ధం చేయాల్సిన సీఎం కేసీఆర్​ఆయుధాలు పక్కన పడేసి ఫాంహౌస్​లో నిద్రపోతున్నారని విమర్శించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ఉత్సవ విగ్రహంగా తయారయ్యారని, ఆయన చెపితే ఎవరు వినరు, ఆయన చెప్పినా ఒక్క పోస్ట్ మంజూరు కాదన్నారు. ఇతర మంత్రులంతా భజనపరులుగా మారారని విమర్శించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా కుంటుపడిందన్నారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసిందని, పాజిటివ్​వచ్చిన వారిని హోంక్వారంటైన్​లో ఉండాలని చెప్పి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. ధనిక రాష్ట్రంలో కరోనా పేషెంట్లకు కనీసం తిండికూడా పెట్టలేని దురావస్థలో ప్రభుత్వం ఉందన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో వసతులను తెలుసుకుంటున్న సీఎల్పీ లీడర్​ భట్టి విక్రమార్క

ప్రభుత్వాసుపత్రుల్లో కోవిడ్ ​నిర్ధారణకు ఉపయోగపడే సీటీ స్కాన్​మిషన్లు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమేనన్నారు. సీఎం కేసీఆర్​ అసమర్థత వల్లే రాష్ట్రంలో అనేక మంది కరోనా బారినపడి చనిపోతున్నారని విమర్శించారు. అన్ని జిల్లా ఆస్పత్రులను సూపర్ ​స్పెషాలిటీ హాస్పిటల్స్​గా మారుస్తామన్న ముఖ్యమంత్రి హామీ నీటిమూట అయిందన్నారు. సీఎం కేసీఆర్, ఆయన అల్లుడు హరీశ్ రావు ప్రాతినిథ్యం వవహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇలాగైతే రోగులకు మెరుగైన వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని, ప్రతి సెగ్మెంట్​కు ఒక గవర్నమెంట్ ​ఐసోలేషన్​ సెంటర్ ను ఏర్పాటుచేసి అన్ని సౌలత్​లు కల్పించాలని, జిల్లా హాస్పిటళ్లను 350 పడకల స్థాయికి అప్​గ్రేడ్​చేసి అన్ని పోస్టులు భర్తీచేయాలని, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు.