న్యూఢిల్లీ: కరోనా లాక్ డౌన్‌తో ఇంటికే పరిమితమైన బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్.. తన కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ అద్భుతమైన సంఘటనను అభిమానులతో పంచుకున్నాడు. ఓ రంజీ మ్యాచ్‌లో అజిత్ వాడేకర్ ప్యాడ్స్ కట్టుకుని బరిలోకి దిగాల్సి వచ్చిందన్నాడు. అయితే ఆ మ్యాచ్‌లో శతకం కొట్టడంతో తన కెరీర్ ఊపందుకుందని చెప్పాడు. ‘శ్రీలంకలో ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ టోర్నీలో ట్రిపుల్ సెంచరీ చేయడంతో నాకు భారత్ జట్టు నుంచి పిలుపు వచ్చింది. కానీ ముంబై రంజీ టీమ్‌లో చోటు కోల్పోయాను. ఎందుకంటే లంకలో ఉండడంతో ఓ రంజీ మ్యాచ్‌ను ఆడలేకపోయాను. ఆ మ్యాచ్‌లో వేరే ప్లేయర్ బాగా ఆడాడు. దీంతో నన్ను 12వ ఆటగాడిగా ఎంపిక చేశారు.
మ్యాచ్‌కు ముందు ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా మా కెప్టెన్ అజిత్ వాడేకర్ గాయపడ్డాడు. టాస్‌కు ముందే ఇది జరగడంతో తుదిజట్టులో నాకు చోటు దొరికింది. అయితే ఇప్పుడున్నట్లు.. అప్పట్లో మాకు పెద్ద కిట్స్ ఉండేవి కావు. నేను ఓ చిన్న బ్యాగ్‌లో షూస్, సాక్స్‌లు మాత్రమే తెచ్చుకున్నా. ప్యాడ్స్, గ్లోవ్స్ తీసుకురావడం మరిచిపోయా. బ్యాటింగ్, బౌలింగ్ విషయం తేలకపోవడంతో వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి ప్యాడ్స్ తీసుకురమ్మని చెప్పా. కానీ ఈ లోపే బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. మరోదారి లేక వాడేకర్‌ను అడిగి అతని ప్యాడ్స్ కట్టుకుని బ్యాటింగ్ చేశా. వాడేకర్ ఎడమ చేతి వాటం. నేను కుడిచేతి వాటం. దీంతో ప్యాడ్స్ వల్ల కాస్త ఇబ్బంది పడ్డాను. కానీ ఆ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు’ అని సన్నీ చెప్పుకొచ్చాడు.