- చిన్నారుల మృతి.. తల్లి పరిస్థితి విషమం
సారథి న్యూస్, మేడ్చల్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చిన్నారులు చనిపోగా, తల్లి పరిస్థితి విషమంగా మారింది. పోలీసుల కథనం మేరకు.. వరంగల్ జిల్లాకు చెందిన గోపీనాథ్‌కు ప్రీతి అనే మహిళతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా వీరు మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని మజీద్‌పూర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు గౌరవ్(4), కౌశిక్(3) ఉన్నారు. గోపీనాథ్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా కుటుంబసమస్యల కారణంగా భార్యాభర్తలు ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో తరచూ గొడవపడేవారు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి దంపతులిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన ప్రీతి బుధవారం తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన స్థానికులు వారిని మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. పరిస్థితి విషమించడంతో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ప్రస్తుతం ప్రీతి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై కేసుదర్యాప్తు చేస్తున్నామని శామీర్‌పేట ఎస్సై గణేశ్ తెలిపారు.